ఎంపీ మహువా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ

2 Nov, 2023 20:11 IST|Sakshi

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా గురువారం లోక్‌సభ నైతిక విలువల కమిటీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే కమిటీ సంబంధం లేని చెత్త ప్రశ్నలు అడిగారంటూఎంపీ మహువాతోపాటు బీఎస్పీ ఎంపీ డ్యానిష్‌ అలీ, గిర్ధారీ యాదవ్‌తోపాటు మరికొంతమంది ప్రతిపక్ష ఎంపీలు విచారణ నుంచి మధ్యలోనే బయటకొచ్చారు.

ఎథిక్స్‌ కమిటీ సభ్యులు వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు అడుగుతున్నారంటూ మీడియా ముందు మహువా మండిపడ్డారు. రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని, అసలు ఇది ఎథిక్స్‌ కమిటేనా అని ప్రశ్నించారు. ‘నా కంట్లో నీళ్లు వస్తున్నాయంటూ చెత్త వాగుడు వాగుతున్నారు. మీకు నా కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయా’ అని ధ్వజమెత్తారు.

అయితే మహువా చేసిన ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌ వినోద్‌ సోంకర్‌ ఘాటుగా స్పందించారు. టీఎంపీ ఎంపీ విచారణకు సహకరించలేదని అన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిందని మండిపడ్డారు. ‘మొయిత్రా విచారణ సమయంలో సమాధానాలు చెప్పకుండా.. కమిటీ సభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పదజాలంతో చైర్మన్‌, ప్యానెల్‌ మెంబర్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా  తప్పించుకోవడానికే మహువా, డ్యానిష్‌ అలీ, గిర్దారీ యాదవ్‌, ఇతర ప్రతిపక్ష ఎంపీలు కమిటీని నిందిస్తూ ఆకస్మాత్తుగా బయటకొచ్చేశారు. దీనిపై ప్యానెల్‌ మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటుంది’ అని వినోద్‌  సోంకర్‌ వెల్లడించారు. 
చదవండి: ఎలక్టోరల్‌ బాండ్‌ల వివరాలు ఇవ్వండి: ఈసీకి సుప్రీం ఆదేశం

మరోవైపు మోయిత్రాను ఎథిక్స్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ అడిగిన ప్రశ్నలు అనైతికంగా ఉన్నట్లు తాము గుర్తించామని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అతను ఎవరో ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నాడనే విషయం అర్థమవుతోందన్నారు. ఇది మంచిది కాదని అన్నారు. కమిటీ సభ్యులు మహువా ‘ఎక్కడికి వెళ్లున్నారు? ఎక్కడ ఎవరిని కలుస్తున్నారు? మీ ఫోన్ రికార్డులు మాకు ఇవ్వగలరా?’ అంటూ చెత్త ప్రశ్నలు అడుగుతున్నారని ఉత్తమ్‌ పేర్కొన్నారు.అదే విధంగా జనతాదళ్ఎంపీ గిరిధారి యాదవ్ మాట్లాడుతూ, మహువా మోయిత్రాను వ్యక్తిగత ప్రశ్నలు అడిగే హక్కు ప్యానెల్‌కు లేదని అన్నారు.

మరిన్ని వార్తలు