కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటిని  చంపితే రూ. 50 లక్షలు

1 Dec, 2021 18:31 IST|Sakshi

మధిర మున్సిపల్‌ కౌన్సిలర్, మాజీ టీడీపీ నేత సుపారి ప్రకటన

తెలుగు రాష్ట్రాల సోషల్‌ మీడియాలో వైరల్‌ 

చంద్రబాబు ‘ఏడుపు ఎపిసోడ్‌’కు ఎలాగైనా సానుభూతి సంపాదించాలనే కుట్ర 

సాక్షి, అమరావతి/మధిర: చంద్రబాబు ఏడుపు పాట ముగించకుండా సుదీర్ఘ ఎపిసోడ్లుగా సాగదీసి అయినా సానుభూతి సంపాదించి పెట్టాలని ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనలో  మధిర కౌన్సిలర్‌ సుపారి ప్రకటన వెలువడిందని పరిశీలకులు భావిస్తున్నారు. శాసనసభ రికార్డుల సాక్షిగా ఎవరూ అనని మాటలను అన్నట్లుగా భావించి, వాటిని తనకు ఆపాదించుకుని, తనే ప్రచారంలో పెట్టి, తాను విలపించిన ఎపిసోడ్‌లో సానుభూతి రాకపోయే సరికి, ఏడుపు పాట భిన్న రూపాల్లో కొనసాగుతోంది.

ఏపీ మంత్రి కొడాలి నాని, ఎంఎల్‌ఏలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను హత్య చేసేందుకు ముందుకొస్తే తాను రూ.50 లక్షలు ఇస్తానని మధిర మున్సిపల్‌ కౌన్సిలర్‌ మల్లాది వాసు ఇచ్చిన ‘సుపారి ఆఫర్‌’ తెలుగు రాష్ట్రాల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నవంబర్‌ 28న ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం సమీపంలో బొప్పన నాగేశ్వరరావు మామిడితోటలో జరిగిన వనసమారాధన కార్యక్రమం సభావేదికపై కౌన్సిలర్‌ మల్లాది వాసు మాట్లాడుతూ.. ‘సమయం ఆసన్నమైంది.. మనల్ని మనమే ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కులంలో ఉన్నటువంటి కొన్ని చీడ పురుగులు వంశీ, కొడాలి నాని, అలాంటి వాళ్లే గాకుండా మదపుటేనుగులా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబు.. ఇట్లాంటి వాళ్లను కూడా మనం ఓ ఆపరేషన్‌ స్టార్ట్‌ చేసి భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది.

దాని కోసం ఈ వేదిక మీద నుండి రూ.50 లక్షలు ప్రకటిస్తున్నా’  అంటూ సుపారి ప్రకటించారు. ఇలా ప్రకటన చేయడం వెనక... చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్‌ ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమైన నేపథ్యంలో ప్రజల మెదళ్లలో ‘బాబు ఏడుపు’ను రిజిస్టర్‌ చేసి ఇప్పటికైనా సానుభూతి సంపాదించాలనే కుట్ర దాగి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రూ.50 లక్షల సుపారి ప్రకటన చేసిన కౌన్సిలర్‌ వాసు గతంలో టీడీపీలో పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లోకి, తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. తామే వివిధ పార్టీల్లోకి పంపిన తమ అనుచరులతో మాట్లాడించి, ఏదో రకంగా సానుభూతి, రాజకీయ లబ్ధి పొందేలా టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇలాంటి ప్రకటనలు వెలువడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో చంద్రబాబు అనుచరులుగా ఉండి తర్వాత వివిధ కారణాల వల్ల పార్టీ మారిన నేతలు చంద్రబాబు ఇబ్బందుల్లో ఉన్పప్పుడల్లా బాబు ప్రయోజనాల పరిరక్షణకు అనుగుణంగా మాట్లాడటాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. టీడీపీని వీడి బీజేపీలో చేరినా, చంద్రబాబు పాట పాడుతున్న ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి ఈ కోవలేకే వస్తారని అంటున్నారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ, ఎమ్మెల్సీ తలశిల రఘురాంను కులం నుంచి వెలివేయాలని తెలంగాణ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నేతృత్వంలో కమ్మ సంఘంలో తీర్మానం చేయడం వెనకా.. చంద్రబాబును ఎవరూ అనని మాటలని అన్నట్లుగా చిత్రీకరించి ప్రజల మెదళ్లలోకి చొప్పించాలనే కుతంత్రం ఉందనే విషయం సులభంగానే అర్థమవుతుందని చెబుతున్నారు. ఈ ప్రణాళిక టీడీపీ కార్యాలయంలోనే రూపుదిద్దుకుందని సమాచారం.

గోవా క్యాంప్‌లో వాసు.. 
బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వహణతో పాటు కర్ర వ్యాపారం చేస్తున్న మల్లాది వాసు మధిర మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్‌ కాగా, ఆయన సతీమణి మల్లాది సవిత 9వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులిద్దరూ గత మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొంది ఇటీవల టీఆర్‌ఎ‹స్‌లో చేరారు. ప్రస్తుతం ఎంఎల్‌సీ ఎన్నికల క్యాంప్‌లో భాగంగా ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి గోవాలో ఉన్నారు.

మరిన్ని వార్తలు