బీజేపీ నేతల యాత్రలు పెద్ద డ్రామా

28 Jul, 2021 03:53 IST|Sakshi

టీడీపీ హయాంలో గుడులు కూల్చినపుడు కళ్లు మూసుకున్నారేం? 

ఆ గుళ్లను సీఎం జగన్‌ పునర్నిర్మాణం చేశారు 

సోము వీర్రాజుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం 

సాక్షి, అమరావతి:  బీజేపీ నేతల మత రాజకీయాలతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో అన్ని మతాల ప్రజలు సుఖ సంతోషాలతో కలసి ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆలయాల సందర్శన పేరుతో డ్రామా యాత్రలకు ఎవరి మెప్పు కోసం తెరదీశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోము వీర్రాజుకు విష్ణు పలు ప్రశ్నలను సంధించారు. 

► వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక తెలుగుదేశం హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాల పునర్నిర్మాణం చేపట్టారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.  ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి ఇవ్వకముందే.. ధర్నా చేయడం ఏమిటి? 
► 2016లో కృష్ణాపుష్కరాల సమయంలో చంద్రబాబు హయాంలో శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన ఆలయాల మొదలు చిన్న ఆలయాల వరకు కూల్చివేశారు. ఆనాడు సోము వీర్రాజు ఎందుకు నోరు మెదపలేదు? 
► తిరుమలలో పోటు గదులను మూసివేసి వాటిలో తవ్వకాలు జరిపారు. దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారు. అర్చకులకు వంశపారంపర్యమైన హక్కులు కల్పించమంటే.. గొంతెమ్మ కోర్కెలు కోరవద్దని అవమానించారు. అప్పుడేమయ్యారు? 
► చంద్రబాబు హయాంలో వేధింపులు తట్టుకోలేక అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అమరావతి సదావర్తి భూములతో సహా.. దేవాలయాల భూములను మింగేశారు. ఇవన్నీ మీ భాగస్వామ్యంలో జరగలేదా?   
► తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా.. కనీసం స్పందించలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణకు నిదర్శనం కాదా?   

మరిన్ని వార్తలు