అసత్య ప్రచారాలు ఆపు

6 Sep, 2021 03:48 IST|Sakshi

సోము వీర్రాజుపై మండిపడ్డ మల్లాది విష్ణు

కరోనా కట్టడికి కేంద్రం ఆదేశాలనే అమలు చేస్తున్నాం

మీరు ప్రశ్నించాలనుకుంటే కేంద్రాన్నే అడగాలి

రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు

నిబంధనలు అన్ని మతాలకూ ఒకటే 

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాల మేరకే అన్ని మతాల పండుగలు, కార్యక్రమాలకు ఒకే రకమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 28న కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో నాలుగో పేరా ప్రకారం బహిరంగ ప్రదేశాలలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టంగా ఉందన్నారు. ఆ మార్గదర్శకాలను ఒకసారి చదువుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సూచించారు.

వీటిని పరిగణనలోకి తీసుకుంటే సోము వీర్రాజు నిలదీయాల్సింది కేంద్రాన్ని అని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలిసి కూడా సోము వీర్రాజు అసత్యాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల గురించి తెలుసుకోకుండా, కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పును పట్టించుకోకుండా ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధిస్తున్నామంటూ అసంబద్ధమైన కార్యక్రమాలను తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే బహిరంగ ప్రదేశాలు, పందిళ్లలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వడం లేదని వివరించారు. 
రానున్న పండుగ సీజన్లో జనం పెద్దసంఖ్యలో గుమిగూడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు 

సిగ్గుందా?.. పచ్చి అబద్ధాలు
‘సోము వీర్రాజుకు అసలు సిగ్గు ఉందా? ఆలయాల్లో కూడా పండుగ నిర్వహించకూడదని ప్రభుత్వం చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో పండుగ వేడుకలు నిర్వహించకూడదని కేంద్రం స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేస్తే ఇక్కడ రాద్ధాంతం చేస్తున్నారు’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను మీరే ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. కావాలంటే అలాంటి ఆదేశాలు ఎందుకు జారీ చేశారని కేంద్రాన్నే ప్రశ్నించాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన కరోనా వ్యాక్సిన్లు, ఇతర నిధుల గురించి సోము వీర్రాజు ఏనాడూ మాట్లాడలేదన్నారు.

కరోనా కట్టడి కోసమే..
కరోనాను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్స్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసిందని మల్లాది విష్ణు గుర్తు చేశారు.  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించిందన్నారు. ఆదివారం గురు పూజోత్సవ కార్యక్రమాలను కూడా రద్దు చేసిందని వివరించారు. కరోనా కట్టడి కోసం, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసమే ఈ చర్యలు తీసుకుందన్నారు. 

ఎవరా స్వామీజీ?
‘ఎవరో శ్రీనివాసానంద సరస్వతి స్వామి అట.. అసలు ఆయన ఎవరో తెలియదు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆయనతో ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా తెలియదు. దారినపోయే స్వామీజీలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నించడం సరి కాదు’ అని మల్లాది విష్ణు సూచించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు