హీటెక్కిన పార్లమెంట్‌ సమావేశాలు.. సభలో ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

8 Feb, 2023 13:52 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో బుధవారం కూడా అదానీకి సంబంధించిన హిండెన్‌బర్గ్‌ నివేదికపై రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. 

కాగా, ఉభయ సభల్లో కేంద్ర మంత్రులు కౌంటర్‌కు దిగారు. కాంగ్రెస్‌ నేతలు హిండెన్‌బర్గ్‌ విషయం ప్రస్తావించగా.. బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌ బోఫోర్స్‌ అంశాన్ని లేవనెత్తారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, పీయూష్‌ గోయల్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఖర్గే ఆరోపణలకు కేంద్ర మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశ భద్రత విషయంలో రాజీలేదని స్పష్టం చేశారు. 

ఈ సందర్బంగా ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాట్లాడుతూ.. నేను నిజం మాట్లాడితే అది దేశ వ్యతిరేకమా? నేను దేశ వ్యతిరేకిని కాదు. ఇక్కడ అందరికంటే నాకు దేశభక్తి ఎక్కువ. మీరు దేశాన్ని దోచుకుంటున్నారు. నేను దేశ వ్యతిరేకిని అని చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. 

అటు బడ్జెట్‌ కేటాయింపులపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాల సందర్భంగా సభలో ఒవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలో ముస్లింల గురించి ఒక్క​ మాట కూడా లేదు. మైనార్టీల పథకాలకు బడ్జెట్‌లో నిధులు తగ్గించారు. ఆకుపచ్చ రంగు అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకంత అసహనం?. జాతీయ జెండాలో ఆకుపచ్చరంగును తీసేస్తారా?. మీ నారీశక్తి నినాదం బిల్కిస్‌ బానో విషయంలో ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

మరిన్ని వార్తలు