వారు కోరడం వల్లే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా

2 Oct, 2022 14:57 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే ఆదివారం మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. తాను ఎవరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి పోటీ చేయట్లేదని, పార్టీ సీనియర్ నేతలు, యువనేతలు కోరడం వల్లే బరిలోకి దిగినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడే తన లక్ష‍్యమన్నారు. అలాగే తన వెనుక గాంధీ కుటుంబం ఉందని వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. గాంధీలు ఎవరికీ మద్దతు ప్రకటించలేదని చెప్పారు. ఎన్నికలు చాలా పారదర్శకంగా జరుగుతాయని పేర్కొన్నారు. జీ-23నేతలు మాత్రం తనకే మద్దతు తెలిపారని వివరించారు.

ఒక్కరికి ఒకే పదవి ఉండాలనే పార్టీ నిబంధనను గౌరవిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్‌ సమర్పించిన రోజే రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి తాను రాజీనామా చేసినట్లు ఖర్గే వెల్లడించారు. ఒకేవేళ ఈయన అధ్యక్షుడిగా గెలిస్తే 136ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తొలి దళిత నేతగా అరుదైన ఘనత సాధిస్తారు.

ఖర్గే గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు రాదని, తాను గెలిస్తేనే సంస్కరణలు తీసుకొస్తానని శశిథరూర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఖర్గే స్పందించారు. ఎవరు గెలిచినా పార్టీలో సంస్కరణల కోసం సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే బీజేపీపై విమర్శలు గుప్పించారు ఖర్గే. కమలం పార్టీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు.

మరోవైపు ఖర్గేకు మద్దతుగా ఆయన కోసం ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవులకు గౌరవ్ వల్లభ్, దీపిందర్ హుడా, నజీర్ హుస్సేన్ రాజీనామా చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖర్గే విజయం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు.
చదవండి: శుక్రవారం నామినేషన్.. శనివారం రాజీనామా

మరిన్ని వార్తలు