అన్నీ రూమర్లే..సోనియా నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు: ఖర్గే

12 Oct, 2022 12:19 IST|Sakshi

లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌లు పోటీ పడుతున్నారు. అయితే, అధిష్ఠానం తరపు అభ్యర్థి, అంతర్గతంగా సోనియా గాంధీ సపోర్టు మల్లికార్జున్‌ ఖర్గేకు ఉందంటూ కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా అధ్యక్ష పదవికి ఖర్గే పేరును స్వయంగా సోనియా గాంధీనే సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అవి అన్నీ వదంతులేనని తీవ్రంగా ఖండించారు మల్లికార్జున్‌ ఖర్గే. సోనియాజీ తన పేరును సూచించలేదని, అంతర్గతంగా తనకు సోనియా నుంచి ఎలాంటి మద్దతు లేదని పేర్కొన్నారు. 

‘అధ్యక్ష పదవికి నా పేరును సోనియా గాంధీ సూచించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను ఎప్పుడూ ఆ విషయాన్ని చెప్పలేదు. గాంధీ కుటుంబ నుంచి ఎవరూ ఎన్నికల్లో పాల్గొనటం, అభ్యర్థులకు మద్దతు తెలపటం వంటివి చేయరని ఆమె స్పష్టంగా చెప్పారు. కొందరు కాంగ్రెస్‌ పార్టీ, సోనియా, నన్ను అప్రతిష్ఠపాలు చేసేందుకు రూమర్స్‌ వ్యాప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనబోనని, ఎవరికీ మద్దతు తెలపనని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 9300 మంది సభ్యులు అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకుంటారు. మెజారిటీ వచ్చిన వారు అధ్యక్ష పదవి చేపడతారు.’ అని తెలిపారు ఖర్గే.

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సరిగా లేవని, మోదీ, అమిత్‌ షా రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం కుంటుపడుతోందని విమర్శించారు ఖర్గే. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై పోరాడేందుకు తగిన శక్తి కావాలని, కాంగ్రెస్‌ ప్రతినిధుల సిఫారసు మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పోటీ చేయాలని ఒక్కరోజు ముందు చెప్పారు: ఖర్గే

మరిన్ని వార్తలు