ధరణి.. సంస్కరణ కాదు సంక్షోభం

10 Feb, 2021 17:10 IST|Sakshi

 రైతుబంధు పేరుతో సబ్సిడీలు ఆపేసిన కేసీఆర్

వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడని రైతుబంధు

కడెం ప్రాజెక్టుపై కేసీఆర్ అలసత్వం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

సాక్షి, అదిలాబాద్‌: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన అనేక సబ్సిడీలకు కోత పెట్టి.. రైతుబంధు పేరుతో కేసీఆర్ అన్నదాతలను మోసం చేస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని సీఎల్పీ బృందం బుధవారం రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని ఏర్రాటు చేసింది. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు భరత్ చౌహాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి దుర్గాభవానీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, స్థానిక మండల ఇంఛార్జి పొద్దుటూరి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కడెం రైతులతో సమావేశం అయ్యారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు పేరు మీద ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయాన్ని, సబ్సిడీనికి కేసీఆర్ ప్రభుత్వం ఆపేసిందని రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసాలు ప్రజలకు, రైతులుకు అర్థమవుతోందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేవలం భూములున్న భూస్వాములకు, వందల ఎకరాల బీడు భూమి ఉన్న ఆసాములకు మాత్రమే ఉపయోగపడుతోంది తప్పా.. నిజంగా భూమిని దున్నే రైతులకు ఉపయోగపడడం లేదని పేర్కొన్నారు. భూమిని నమ్మి పంట పండించే రైతులకు మద్దతు ధరలేక.. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదన్నారు. అంతేగాక గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు కూడా లేక... అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. 

ఈ ప్రాంతంలో నాటి దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన సదర్మఠ్ ప్రాజెక్టును కుట్రతోనే డిజైన్ మార్చి.. ఈ ప్రాంత వాసులకు నీళ్లు రాకుండా చేశారని భట్టి ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కోసం నిర్మించిన కడెం ప్రాజెక్టు ద్వారా చివరి భూములకు నీళ్లు అందించేలా ప్రతి ఏడాది మెయింటెనెన్స్ చేయడం జరిగేదన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మెయిటెనెన్స్ చేయకపోవడంతో కింది ప్రాంత రైతులకు నీళ్లు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కడెం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం మంజూరు చేసిన 130 మంది ఉద్యోగులను గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం 101 మందిని తొలగించి.. కేవలం 29 మందితో ప్రాజెక్టు నిర్వహణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాదాపు 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అలసత్వం వహించడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడెం ప్రాజెక్టును రైతులకు దూరం చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ధరణితో రైతులందరిని కేసీఆర్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని భట్టి ధ్వజమెత్తారు. ధరణి అనేది సంస్కరణ కాదు.. సంక్షోభం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల్లోపు ఉన్నవారే.. వారంతా పండించిన పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలు.. దేశ రైతాంగాన్ని వణికిస్తున్నాయని భట్టి విక్రమార్క పెర్కొన్నారు. 

మరిన్ని వార్తలు