దళిత, గిరిజనులకు చేసిందేమిటి? 

10 Sep, 2021 03:22 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ సర్కారుపై మల్లు రవి ధ్వజం

గజ్వేల్‌: అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్లల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసాలతో కాలం గడపడం తప్ప దళిత, గిరిజనులకు ఒరగబెట్టిందేమీ లేదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ఏర్పాట్లను గురువారం డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలసి ఆయన పరిశీలించారు.

అంతకుముందు నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నదన్నారు. మరోపక్క ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం ప్రకారం 2014 నుంచి 2021 వరకు దళితుల అభ్యున్నతికి రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. 60వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను దారి మళ్లించారన్నారు.

అధికార పార్టీ మోసాలను ఎండగట్టగడానికే రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు