కేటీఆర్‌ సమర్థుడైతే.. కేసీఆర్‌ అసమర్థుడా?

4 Jan, 2021 08:27 IST|Sakshi

మాజీ ఎంపీ మల్లు రవి 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవికి మంత్రి కె.తారకరామారావు‌ సమర్థుడని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ ‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తప్పుబట్టారు. కేటీఆర్‌ సమర్థుడని అంటే సీఎం కేసీఆర్‌ అసమర్థుడా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి మండలిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పదవితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.

ఈ ఏడాది జూన్‌లో శాసనమండలి సభ్యుడిగా తన పదవీకాలం ముగుస్తుందని, ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును పార్టీ అధినేత నిర్ణయిస్తారన్నారు. సాగర్‌లో స్థానికులు, స్థానికేతరులు అనే నినాదం అర్ధరహితమని, నాయకులందరూ హైదరాబాద్‌లో మకాం వేసి రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా.. ‘ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మంత్రి కేటీ రామారావుకు అన్ని అర్హతలు ఉన్నాయి. పాలనా సామర్థ్యం ఉంది’ అని గుత్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. (చదవండి: ఎన్నికల కోసమే ప్రమోషన్లు, పీఆర్సీ)

మరిన్ని వార్తలు