అధిష్టానం కూడా మాలాగే ఆలోచిస్తోంది: మల్లు రవి

26 Dec, 2020 14:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష‌ పదవి కాంగ్రెస్‌ నేతల మధ్య చిచ్చు రేపుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం ఖరారైరందన్న వార్తల నేపథ్యంలో సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి హనుమంతారావు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టడం సరికాదంటూ ఆయన విమర్శించారు. అదే విధంగా అభిప్రాయ సేకరణలో భాగంగా ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ప్యాకేజీకి అమ్ముడు పోయారని ఆరోపించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవిపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. వీహెచ్‌ వ్యాఖ్యలపై మల్లు రవి శనివారం స్పందించారు. మాణిక్యం ఠాగూర్‌ సహా ఇతర కాంగ్రెస్‌ నేతలపై హనుమంతారావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమ ప్రాంతవాసుడైన రేవంత్‌రెడ్డి పార్టీ ఎంపీ, వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్నారని, ఆయనకు పీసీసీ పదవి ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పినట్లు పేర్కొన్నారు.(చదవండి: రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేస్తే పార్టీలో కొనసాగలేను)

ఇవేం మాటలు?!
ఇక పీసీసీ చీఫ్‌ ఎంపిక అంశం గురించి మాట్లాడుతూ.. ‘‘165 మంది నాయకులతో పాటు నా అభిప్రాయాన్ని కూడా అధిష్టానం తీసుకుంది. ఏఐసీసీ దూతగా వచ్చిన ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌పై ఆరోపణలు చేస్తే అది అధిష్టానం పైన చేసినట్టే. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని  స్థాయిల్లోని నాయకులతో ఏఐసీసీ ఇంఛార్జీలు, 4 రోజులపాటు సుదీర్ఘంగా చర్చించి అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శులు మరి కొంత మంది ముఖ్యనేతలతో మరో దఫా చర్చలు జరిపారు. ఇంతలోతుగా సమీక్ష చేసి అన్ని వర్గాల నాయకుల అభిప్రాయాలతో మాణిక్యం ఠాగూర్, కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. నిజానికి ఇంత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నడూ చర్చలు జరగలేదు. క్రమశిక్షణ గల నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలి.

గతంలో జరిగిన అనేక కీలక నిర్ణయాలలో కూడా సీఎం, సీఎల్పీ, పీసీసీ నియామకాల విషయంలో అందరూ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పని చేశారు. నివేదికలో ఏముందో అధిష్టానానికి తప్ప ఎవరికి తెలియదు, పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా ఆరోపణలు చేయడం తగదు. క్రమశిక్షణా ఉల్లంఘించి మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలము.. కానీ అధిష్టాన నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే నాయకులం కాబట్టి అలా చేయం. ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితులలో ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇస్తే బాగుంటుందో పార్టీ అధిష్టానానికి తెలుసు. పార్టీ బాగుపడాలని, తిరిగి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఆశయ సాధన లక్ష్యం నెరవేరాలని కోరుకునే వాళ్ళం. అధిష్టానం కూడా అలాగే ఆలోచిస్తుంది’’ అని మల్లు రవి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు