మా మద్దతు లేకుండా బీజేపీని ఓడించలేరు

2 Dec, 2021 16:02 IST|Sakshi

కాంగ్రెస్‌ నాయకుల ఉద్ఘాటన

మమత బెనర్జీ వ్యాఖ్యలపై గరం

బీజేపీకి లబ్ది చేకూరుస్తున్నారని ఆరోపణ

పవార్‌ పరువు తీస్తున్నారని మండిపాటు

న్యూఢిల్లీ: తమ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అంటున్నారు. ‘యూపీఏ ఎక్కడుంది’ అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా స్పందించారు. 

కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామం లేకపోతే ఆత్మలేని శరీరంలా యూపీఏ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. విపక్షాలు ఏకధాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమెందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి ప్రయోజనం కలిగేలా మమత బెనర్జీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. శరద్‌ పవార్‌ పరువు తీయడానికి ఆమె కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ మద్దతు లేకుండా బీజేపీని ఓడించగలమని కలలు కనడం మానుకోవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. (చదవండి: యూపీఏ అన్నదే లేదు.. కాంగ్రెస్ పార్టీతో కలవలేం)


కాంగ్రెస్‌ పార్టీ లేకుండానా?

బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ... ‘మా పోరాటం అధికార పార్టీ (బీజేపీ)పైనే. మాతో చేతులు కలపాలనుకునే వారు మాతో రావాలి, మాతో చేరకూడదనుకునే వారు స్వేచ్ఛగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన రాజకీయ కూటమిలో కాంగ్రెస్‌ పార్టీకి భాగస్వామ్యం లేకుండా ఉంటుందా?’ అని ప్రశ్నించారు. (చదవండి: మమత బెనర్జీ వ్యూహమేంటి? ప్రత్యామ్నాయం అవుతారా?)


బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలపాలి: ఖర్గే

కాంగ్రెస్ తలపెట్టిన వివిధ సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని భాగస్వామి చేయడానికి ప్రయత్నించామని రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రతిపక్షాలు విడిపోయి తమలో తాము పోరాడుకోకుండా.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ చేతులు కలపాలని ఆయన కోరుకున్నారు.

మరిన్ని వార్తలు