రాష్ట్రపతి ముర్మును క్షమాపణలు కోరిన సీఎం మమతా.. ఎందుకంటే?

14 Nov, 2022 19:59 IST|Sakshi

కోల్‌కతా:  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ క్షమాపణలు తెలియజేశారు. రాష్ట్రపతిపై తమ పార్టీ మంత్రి అఖిల్‌గిరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ద్రౌపది ముర్మును క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే తాము వ్యతిరేకిస్తామని, అలాంటి వాటిని తాము సహించమని చెప్పారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అతన్ని హెచ్చరించినట్లు తెలిపారు.

రాష్ట్రపతిని మేము ఎంతగానో గౌరవిస్తాం. అమె మంచి మహిళ. అఖిల్‌ గిరి తప్పు వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. మా ఎమ్మెల్యే తరపున  నేను క్షమాపణలు కోరుతున్నా. ఐయామ్‌ సారీ. అందం అనేది బయటకు ఎలా కనిపిస్తారనేది కాదు. లోపల నుంచి ఎలా ఉన్నాం. ఎలా ఆలోచిస్తారనేది ముఖ్యం’  అని సీఎం మమతా పేర్కొన్నారు.
చదవండి: రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రిని పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్‌

కాగా  రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, బెంగాల్‌ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి శుక్రవారం నందిగ్రామ్‌లో జరిగిన ఓ ర్యాలిలో మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి నోరుజారారు. ‘బీజేపీ నాయకులు నన్ను చూడటానికి అందంగా లేవని అంటున్నారు.  ఒ​క వ్యక్తి  రూపాన్ని బట్టి మేము ఎవరినీ అంచనా వేయం. మేము రాష్ట్రపతి పదవిని గౌరవిస్తాము. కానీ మన రాష్ట్రపతి చూడటానికి ఎలా ఉంటారు? ’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అఖిల్‌గిరి వ్యాఖ్యాలపై పశ్చిమబెంగాల్‌లో తీవ్ర దుమారం రేగింది.

17 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో చివరికి మంత్రి తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరారు. మంత్రి వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ట్విటర్‌ వేదికగా క్షమాపణలు చెప్పింది. ‘గౌరవనీయ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల మాకు చాలా గౌరవం ఉంది. ఎమ్మెల్యే అఖిల్ గిరి చేసిన దురదృష్టకర వ్యాఖ్యలను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాంటి ప్రకటనలను మేము సమర్థించబోము.. మహిళా సాధికారత యుగంలో స్త్రీల పట్ల ద్వేషం ఆమోదయోగ్యం కాదు' అని పేర్కొంది.
చదవండి: 'కాంగ్రెస్‌కి వేసి ఓట్లను వృధా చేయకండి': అరవింద్‌ కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు