కేంద్ర బలగాలతో జాగ్రత్త: మమత

9 Apr, 2021 04:27 IST|Sakshi

బాలాగర్‌/డోంజూర్‌: ఎన్నికల బందోబస్తుకు వచ్చిన కేంద్ర బలగాల్లోని కొందరు గ్రామాల్లోకి ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. హుగ్లీ జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ.. హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకు కేంద్ర బలగాలు పనిచేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. పోలింగ్‌ రోజుకు ముందు వారు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. మహిళలను సైతం వేధిస్తున్నారు. బీజేపీకే ఓటేయాలని ఓటర్లను అడుగుతున్నారు.

ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు భయపడవద్దు’అని మమత ప్రజలను కోరారు. ‘కేంద్ర బలగాలు అతిగా ప్రవర్తిస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసులు నిరాకరిస్తే నాకు సమాచారం ఇవ్వండి’అని కోరారు. సెక్షన్‌ 144 విధిస్తామని బెదిరిస్తూ ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు వెళ్లకుండా బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. మరో గుజరాత్‌లా బెంగాల్‌ మారకూడదంటే బీజేపీకి ఓటేయవద్దని కోరారు.  హిందు, ముస్లిం ఓటు బ్యాంకు గురించి మాట్లాడిన ప్రధాని మోదీపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఎన్నికల సంఘం (ఈసీ)ని ఆమె ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు