దేశ ప్రధాని ముందే అవమానించారు: మమత

26 Jan, 2021 05:43 IST|Sakshi

అవమానించడమే బీజేపీ సంస్కృతి

మండిపడిన బెంగాల్‌ ముఖ్యమంత్రి

పుర్సురా (పశ్చిమబెంగాల్‌): ‘మీ ఇంటికి ఎవరినైనా పిలిచి అనంతరం వారిని అవమానిస్తారా ? అలాంటి సంప్రదాయం భారత్‌లోగానీ, బెంగాల్‌లోగానీ ఉందా ? నేతాజీ స్లోగన్లను పలికి ఉంటే నేనే వారికి సెల్యూట్‌ చేసేదాన్ని. కానీ కార్యక్రమంతో సంబంధంలేని నినాదాలు చేసి నన్ను దేశ ప్రధాని ముందే అవమానానికి గురి చేశారు. ఇలా అవమానించడమే బీజేపీ సంస్కృతి’ అంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో బీజేపీపై మండిపడ్డారు. బెంగాల్‌లోని పుర్సురాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆమె బీజేపీపై ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకల్లో ప్రధాని ఎదుట మమతా ప్రసంగించే సమయంలో కొందరు వ్యక్తులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయగా, తాను అవమానానికి గురయ్యానంటూ మమత బెనర్జీ వేదిక నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే.

అలాంటి మత నినాదాలు చేసిన వారికి బెంగాల్‌ సంస్కృతి తెలియదని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేయాల్సిందిగా బీజేపీ కోరవచ్చని, వారి నుంచి డబ్బు తీసుకొని, ఓటు మాత్రం తృణమూల్‌ కాంగ్రెస్‌కు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీని బయట నుంచి వచ్చిన పార్టీగా చెబుతూ, భారత్‌ జలావో పార్టీగా అభివర్ణించారు. వారంతా కావాలంటే తనను అవమానించవచ్చని, కానీ బెంగాల్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నమస్కార్‌ అనిగానీ, జైశ్రీరాం అనిగానీ అంటే గౌరవాన్ని చూపుతున్నారని అర్థమని చెప్పారు. ఆ నినాదం చేయాల్సిందిగా తామెవరినీ బలవంతం చేయడం లేదని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌  పేర్కొన్నారు. జై శ్రీరాం నినాదం చేస్తే ఎవరూ నొప్పి పుట్టినట్టు భావించాల్సిన అవసరం లేదని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. 

>
మరిన్ని వార్తలు