మోదీ దేశాన్నే అమ్మేస్తున్నారు

25 Feb, 2021 03:56 IST|Sakshi

ప్రధానిపై మమత దీదీ ఫైర్‌

సహగంజ్‌: ప్రధాని మోదీ అతి పెద్ద ఆందోళన కారుడని, అల్లర్లను సృష్టించడంలో ఆయన ముందుంటారని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే ఘోరమైన భవిష్యత్‌ మోదీకి ఎదురవుతుందని జోస్యం చెప్పారు.  హుగ్లీ జిల్లా సహగంజ్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో మమత పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దేశవ్యాప్తంగా విద్వేషాలను పెంచి పోషిస్తున్నారని, అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని గతవారం ఇదే చోట ఎన్నికల ర్యాలీలో పాల్గొని తృణమూల్‌ కాంగ్రెస్‌ని దోపిడీ పార్టీ అని విమర్శించారు.తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌ కమీషన్ల ప్రభుత్వమని ప్రచారం చేయడానికి కట్‌ మనీ అంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై మమత ఎదురుదాడికి దిగారు. ‘‘మీరు ఏకంగా దేశాన్నే కోట్లాది రూపాయలకు అమ్మేస్తున్నారు. దానినేమని పిలవాలి. క్యాట్‌ మనీయా, ర్యాట్‌ మనీయా’’ అంటూ దీదీ వ్యంగ్య బాణాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల గేమ్‌లో తాను గోల్‌ కీపర్‌నని, బీజేపీ ఒక్క గోల్‌ కూడా చేయలేదని అన్నారు.

మరిన్ని వార్తలు