జయలలిత బాటలో మమత.. సీన్‌ రిపీటవుతుందా

16 Feb, 2021 19:24 IST|Sakshi

ఉత్కంఠ రేపుతున్న బెంగాల్‌ ఎన్నికలు

మూడోసారి అధికారంపై కన్నేసిన మమత

వ్యూహాలకు మరింత పదును

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత దేశ రాజకీయాల్లో సెంటిమెంట్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కొందరు ప్రజాబలాన్ని నమ్మితే.. మరికొందరు సెంటిమెంట్‌నే నమ్ముతున్నారు. తొలిసారి విజయానికి దోహదం చేసిన అంశాలను గుర్తుపెట్టుకుని ప్రతిసారి అదే పంథాను ఎంచుకుంటారు. విజయం కోసం ఒక్కోసారి ఇతర నేతలు పాటించిన వ్యూహాలు, ఎత్తుగడలను సైతం అనురిస్తున్నారు. ఓటర్లు కరుణించినా.. అదృష్టం కలిసిరాకపోతే అధికారం అందదని భావించే నేతలు కూడా చాలామందే ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్నాయి అంటే చాలు ప్రచారానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. తమకు కలిసివచ్చే అంశాలకు సైతం అంతే ఇంపార్టెన్స్‌ ఇస్తారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సెంటిమెంటే ప్రధానంగా వినిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి బెంగాల్‌ కోటపై జెండా పాతాలని భావిస్తున్న తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఏ ఒక్క అవకాశాన్నీ వదలడంలేదు. విపక్షాల ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ రూపంలో వ్యూహకర్త ఉన్నప్పటికీ తన సొంత ఆలోచనలకు సైతం పదునుపెడుతున్నారు.

గతంలో ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు ఎన్నికల్లో గెలిచిన నేతల వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అమ్మా క్యాంటిన్స్‌ను బెంగాల్‌లోనూ ప్రారంభించారు. మా క్యాంటిన్‌ పేరుతో కేవలం రూ.5కే భోజన సదుపాయాన్ని బెంగాలీలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని కోసం 100 కోట్ల రూపాయాలను కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్న సయమంలో 2013లో అమ్మా క్యాంటిన్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే  అమ్మా క్యాంటిన్‌ ఏర్పాటు అనంతరం జరిగిన 2016 ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి విజయం సాధించి చరిత్రను తిరగరాశారు. 1980 తరువాత ఒకేపార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో అదే తొలిసారి. అయితే జయలలిత ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మా క్యాంటిన్‌ అత్యంత ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు.

దీంతో జయ వ్యూహాన్నే తానూ అమలు చేసి రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని దీదీ కలలు కంటున్నారు. దీనిలో భాగంగానే ఎన్నికలకు రెండు నెలల ముందు  మా క్యాంటిన్‌ను లాంఛ్‌ చేశారు. దీని ద్వారా నగరాల్లో ఉపాధి పొందుతున్న పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి లబ్ధి పొందనున్నారు. కాగా జయలలిత అనంతరం దేశ వ్యాప్తంగా అనేక మంది ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే కర్ణాటలోలో సిద్ధరామయ్య ఇందిర క్యాంటిన్‌, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటిన్‌ ప్రవేశపెట్టినప్పటికీ ఓటమిని చవిచూశారు. 2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ రూ.5కే భోజనం హామీ ఇచ్చినప్పటికీ దారుణంగా ఓటమి పాలయ్యారు. అయితే తెలంగాణలో మాత్రం ఈ ఫార్మాలాతో కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారు. తాజాగా మమత కూడా జయ దారినే ఎంచుకున్నారు. తమిళనాడులో మాదిరీగా విజయం సాధిస్తారా లేక ఇతర నేతల్లా ఒటమిని చవిచూస్తారా అనేది చూడాలి.

బీజేపీ సవాల్‌: వ్యూహాలకు ప్రశాంత్‌ పదును

మరిన్ని వార్తలు