నందిగ్రామ్‌ పర్యటనలో మమతపై దాడి!

11 Mar, 2021 03:29 IST|Sakshi

కారు పక్కన నిల్చుని ఉండగా, కొందరు నెట్టివేశారన్న బెంగాల్‌ సీఎం

కాలికి గాయం; కోల్‌కతాలో చికిత్స

‘నందిగ్రామ్‌’ నామినేషన్‌ అనంతరం ఘటన

నందిగ్రామ్‌/కోల్‌కతా: నందిగ్రామ్‌ పర్యటనలో తనపై దాడి జరిగిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. నందిగ్రామ్‌ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు బుధవారం ఆమె నామినేషన్‌ వేశారు. అనంతరం, వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత వివరించారు. సాయంత్రం 6.15 గంటల సమయంలో రేయపరా వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు.

‘నా కారు వెలుపల నిల్చుని ఉన్నా. కారు డోర్‌ తెరచి ఉంది. అక్కడి నుంచి కనిపిస్తున్న గుడివైపు చూస్తూ ప్రార్ధించాను. ఆ తరువాత కార్లోకి వెళ్దామనుకుంటుండగా, అకస్మాత్తుగా నలుగురైదుగురు నా దగ్గరకు వచ్చి, కారు డోర్‌ను నా వైపు గట్టిగా నెట్టారు. ఆ డోర్‌ తగిలి నా ఎడమ కాలికి గాయమైంది. నేను ఒక్కసారిగా ముందుకు పడిపోయాను’ అని వివరించారు. గాయంతో కాలు వాచిందని, జ్వరంగా అనిపిస్తోందని, ఛాతీలో నొప్పిగా ఉందని తెలిపారు. ‘కావాలనే కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది కుట్ర. ఎస్పీ సహా స్థానిక పోలీసులెవరూ ఆ సమయంలో నా దగ్గర లేరు’ అని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వ్యక్తిగత భద్రత సిబ్బంది మమతను కారులో వెనుక సీటులో కూర్చోబెట్టారు.

నిజానికి,  ఆమె బుధవారం రాత్రి నందిగ్రామ్‌లోనే ఉండాలనుకున్నారు. కానీ, ఈ ఘటన జరగడంతో  కోల్‌కతా వెళ్లారు. వెంటనే, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో ఆమెకు  చికిత్స అందించారు. చికిత్స  కోసం ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. మమతని స్ట్రెచర్‌పై ఆసుపత్రిలోకి తీసుకువెళ్తున్న సమయంలో భారీగా చేరుకున్న టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేక  నినాదాలు చేశారు. కాలికి ఎక్స్‌రే తీస్తామని, గాయం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందని వైద్యులు తెలిపారు. మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, పలువురు రాష్ట్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్లారు.

గత రెండు రోజులుగా మమత నందిగ్రామ్‌లోనే ఉన్నారు. తమ పార్టీ అధినేత్రిని ఎన్నికల ప్రచారం నుంచి తప్పించే లక్ష్యంతో కొందరు ఈ దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. మరోవైపు, మమతపై దాడిపై బీజేపీ స్పందించింది. చిన్న ప్రమాదాన్ని పెద్ద కుట్రగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై సీబీఐ  దర్యాప్తు జరపాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్ఘియ డిమాండ్‌ చేశారు. ఇలాంటి ప్రచారాలతో సానుభూతి పొందాలనే ప్రయత్నాలు ఫలించబోవని కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ చౌధురి వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర హోం మంత్రి కూడా ఆమెనే. అందువల్ల ఈ వైఫల్యానికి బాధ్యతగా ఆమె రాజీనామా చేయాలి’ అన్నారు.  

గవర్నర్‌ పరామర్శ
ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మమతను గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ పరామర్శించారు. ఆయన ఆసుపత్రిలోకి వెళ్తుండగా, ‘గో బ్యాక్‌’ అంటూ టీఎంసీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు, సీఎంపై దాడి ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర పోలీసులను ఈసీ ఆదేశించింది.  
 

నందిగ్రామ్‌ నుంచి నామినేషన్‌
హల్దియా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి తన నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ తరఫున బరిలో దిగుతున్న ఒకప్పుడు ఆమెకి అత్యంత సన్నిహితుడు, నందిగ్రామ్‌లో బాగా పట్టున్న నేత సువేందు అధికారితో ఆమె తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తనదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల సేకరణకి వ్యతిరేకంగా ఉద్యమించిన తాను నందిగ్రామ్‌ నుంచి ఎప్పుడూ వట్టి చేతులతో వెళ్లలేదని అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షి వెంట రాగా మమత 2.కిలోమీటర్ల మేర రోడ్డు షో నిర్వహించారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం హల్దియా సబ్‌ డివిజనల్‌ కార్యాలయంలో ఆమె నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ‘‘నందిగ్రామ్‌ నుంచి నా గెలుపు ఖాయం. ఇక్కడి నుంచి సులభంగా నేను విజయం సాధించగలను. జనవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు  సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో నేత ఎవరూ లేకుండా నియోజకవర్గం ఉంది. అప్పుడు సాధారణ ప్రజల ముఖాలు చూసి నేను ఇక్కడ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని దీదీ విలేకరులకు చెప్పారు.

నందిగ్రామ్‌ ఉద్యమ బావుటా
నందిగ్రామ్‌ అన్నది ఒక పేరు కాదు. ఒక ఉద్యమ బావుటా అని మమతా బెనర్జీ ప్రశంసించారు. ‘‘ నేను అందరి పేర్లు మర్చిపోతానేమో, కానీ నందిగ్రామ్‌ పేరును ఎప్పటికీ మర్చిపోను. ఈ ప్రాంతానికి నేనిచ్చే ప్రాధాన్యత అలాంటిది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.  తను ఎప్పుడూ ఇక్కడ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరగలేదని, తన గెలుపు ఇక్కడ ఖాయమన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ఎవరూ విడగొట్టలేరని అన్నారు. నందిగ్రామ్‌ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు కలిసికట్టుగా పాల్గొన్నాయని ఆమె గుర్తు చేశారు. ఇన్నాళ్లూ భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన మమతా బెనర్జీ, బీజేపీ చేసిన సవాల్‌తో కేవలం నందిగ్రామ్‌ నుంచి మాత్రమే పోటీకి దిగారు. ఒక అద్దె ఇంట్లో ఉంటూ తన ప్రచారాన్ని సాగించనున్నారు. మరోవైపు బీజేపీ అ«భ్యర్థిగా గురువారం నందిగ్రామ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేయనున్న సువేందు అధికారి దీటుగా ప్రచారం చేస్తున్నారు. మమతా బెనర్జీ స్థానికురాలు కాదని, తానే ఈ భూమి పుత్రుడినంటూ ప్రచారం చేసుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు