ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమత భేటీ

27 Jul, 2021 16:37 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ మఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మూడోసారి బెంగాల్‌ సీఎం అయ్యాక మమత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. కాగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఎన్నికల్లో టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకున్నాక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేటి నుంచి(మంగళవారం) ప్రారంభమైన తన పర్యటనలో మమత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కూడా కలవనున్నారు. అయితే ప్రధాని మోదీని కలుస్తానని ఢిల్లీకి బయల్దేరేముందే సోమవారం కోల్‌కతాలో విమనాశ్రయంలో విలేకరులకు మమత చెప్పిన విషయం తెలిసిందే.

చెప్పిన విధంగానే ఈరోజు మమత ప్రధానిని కలిశారు. మోదీతో భేటీ తర్వాతే విపక్ష పార్టీలతో వరుస భేటీలు ఉంటాయని తెలుస్తోంది. 30వ తేదీ వరకు ఆమె ఢిల్లీలోనే ఉంటారని, పార్లమెంటుకు వెళ్లి పలు పార్టీల నేతలను కలుస్తారని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. మమత ఢిల్లీ పర్యాటనపై పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ పెదవివిరిచారు. బెంగాల్‌లో నకిలీ కరోనా టీకాల కుంభకోణం, రాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత చెలరేగిన హింస, ఇతర సమస్యలను ఎదుర్కోలేకే ఆమె ఢిల్లీకి వెళ్లిపోయారని దిలీప్‌ ఘోష్‌ ఎద్దేవా చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన బెంగాల్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరేందుకు మోదీని మమత కలుస్తారని ఘోష్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు