తొలి నుంచీ దూకుడే.. వెనకడుగు తెలియని బెబ్బులి మమత 

3 May, 2021 02:44 IST|Sakshi

పోరాటమే ఊపిరిగా ఎదిగిన మమత 

ఆమె దీదీ.. అందరికీ అక్క.. పోరాటాల నుంచే ఎదిగి, పోరాటమే ఊపిరిగా బతికి, ఇప్పుడూ పోరాడి గెలిచి నిలిచిన బెంగాల్‌ బెబ్బులి మమతా బెనర్జీ. బెంగాల్‌ను అప్రతిహతంగా ఏలిన కమ్యూనిస్టులను మట్టికరిపించినా.. ఇప్పుడు బీజేపీ అన్ని రకాల అస్త్రాలతో విరుచుకుపడినా, నమ్మకస్తులంతా వదిలేసి వెళ్లిపోయినా.. ఒంటరిగా పోరాడిన ధీర వనిత ఆమె. ఇప్పుడు కూడా ఎదురుదెబ్బలన్నింటినీ ఓర్చుకుంటూ పశ్చిమ బెంగాల్‌పై మళ్లీ తన పట్టును నిలుపుకొని హ్యాట్రిక్‌ కొట్టారు. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 సీట్లకుగాను 213 సీట్లతో ఘన విజయం సాధించారు. 

కోల్‌కతా: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అన్నింటికన్నా ఎక్కువ ఆసక్తి నెలకొన్నది పశ్చిమ బెంగాల్‌పైనే.. అందరూ ఎదురుచూసింది కూడా ఆ రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనే.. ఎలాగైనా బెంగాల్‌లో పాగా వేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల విస్తృత ప్రచారం, ఫిరాయింపులు, కేసులు సహా అన్ని అస్త్రాలతో రంగంలోకి దిగిన బీజేపీ ఒకవైపు.. ఒంటరిగా నిలబడిన మమతా బెనర్జీ మరోవైపు హోరాహోరీ పోరాడటమే ఈ ఆసక్తికి కారణం. 

బీజేపీ బలగం మొత్తాన్నీ దింపినా..: ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్నికల వ్యూహకర్తలు, సోషల్‌ మీడియా వింగ్‌ సహా బీజేపీ తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను పశ్చిమ బెంగాల్‌లో మోహరించింది. టీఎంసీ నుంచి 40 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకుంది. ప్రధాని మోదీ అయితే ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా ఏకంగా 20 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమిత్‌షా 50 సభల్లో, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా 40 సభల్లో పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్, స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్‌ వంటి సీనియర్లందరూ విస్తృతంగా ప్రచారం చేశారు. ‘జైశ్రీరాం అంటే మమతా బెనర్జీకి అలర్జీ..’అంటూ హిందూ ఓట్లను సమీకరించే ప్రయత్నం చేశారు. కానీ మమతా బెనర్జీ దీటుగా ఎదుర్కొన్నారు. ‘బెంగాలీల ఆత్మగౌర వాన్ని దెబ్బతీసేందుకు బయటివారు (మోదీ, అమిత్‌షా, యోగి.. వంటి నేతలు) ప్రయత్నిస్తున్నారు. బెంగాల్‌ కీ బేటీ కావాలా, బయటివారు కావాలా?’ అంటూ బెంగాలీల్లో సెంటిమెంట్‌ రగిల్చారు. బీజేపీ వాళ్లు జైశ్రీరాం అంటే.. ఆమె బెంగాలీల ఇష్టదైవం ‘జై కాళీమాత’అని నినదించారు. ఎలక్షన్ల సమయంలోనే మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్‌ బెనర్జీ, టీఎంసీ సీనియర్‌ నేత మదన్‌ మిత్రా తదితరులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఇది టీఎంసీ కేడర్‌లో నిరుత్సాహం నింపుతుందని బీజేపీ భావించినా.. మమత ఈ దాడులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు.  చదవండి: (గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ)

రిస్క్‌ అని తెలిసీ 
ఎన్నికల ముందే మమతను దెబ్బకొట్టడానికి బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలూ చేసింది. మమతకు కుడిభుజం అయిన సువేందు అధికారి సహా చాలా మంది బీజేపీలో చేరారు. వారంతా కూడా ఈసారి తృణమూల్‌ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. సువేందు అధికారి అయితే.. ‘దమ్ముంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. ఆమెను 50 వేల ఓట్ల తేడాతో ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా’అని సవాల్‌ చేశాడు. ఫిరాయింపులు ఓవైపు, బీజేపీ దూకుడు మరోవైపు టీఎంసీ శ్రేణుల్లో ఆందోళన రేపితే.. పార్టీ కేడర్‌లో ఉత్తేజం కలిగించేందుకు మమత రిస్క్‌ తీసుకుని మరీ నందిగ్రామ్‌ నుంచి పోటీకి సై అన్నారు. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో తొలి నుంచీ సువేందు అధికారి కుటుంబానిదే ఆధిపత్యం, దానికితోడు బీజేపీ బలం, మోదీ, అమిత్‌షాల అండదండలు అన్నీ కలిసివచ్చాయి. హోరాహోరీ పోటీలో మమత వెనుకబడ్డారు. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం కోల్‌కతా నగరంలోని భవానీపూర్‌ సీటు తృణమూల్‌కు కంచుకోట. అక్కడ మమతకు బదులుగా రంగంలోకి దిగిన పార్టీ అభ్యర్థి 22 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు. అలా అత్యంత సులువుగా గెలవగలిగే చోటును వదిలి మమత ధైర్యంగా నందిగ్రామ్‌లో పోటీకి దిగారు. 

వరుసగా మూడోసారి.. 
పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడి మమతా బెనర్జీ ప్రజల్లో పట్టు సాధించారు. ‘మా.. మాటీ, మానుష్‌’నినాదంతో జనంలోకి వెళ్లారు. బెంగాల్‌లో 34 ఏళ్లు అప్రతిహతంగా సాగిన సీపీఎం పాలనకు చెక్‌ పెడుతూ.. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకుగాను 184 సీట్ల (39% ఓట్లు) తో ఘన విజయం సాధించారు. 2016 ఎలక్షన్ల నాటికి పార్టీని బలోపేతం చేసి, ప్రజల్లో మరింత పట్టు సాధించారు. ఆ ఎన్నికల్లో ఏకంగా 44.9 శాతం ఓట్లతో 211 సీట్లు గెలుచుకున్నారు. ఈ రెండు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి గెలుచుకున్నది 3 సీట్ల చొప్పున మాత్రమే. ఆ తర్వాత బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ బాగా బలహీనపడి.. వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ కూటమి 40 శాతం ఓట్లతో 18 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. దీనిని అసెంబ్లీ సీట్ల లెక్కన చూస్తే.. సుమారు 120 స్థానాల్లో బీజేపీ పాగా వేసినట్టు. ఆ ఫలితాలతో ఆశలు పెంచుకున్న బీజేపీ బెంగాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కానీ ఆ ఆశలపై మమతా బెనర్జీ నీళ్లు చల్లారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా గతంలోకంటే మరిన్ని సీట్లు పెంచుకుని.. 213 చోట్లలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. 

తొలి నుంచీ దూకుడే.. 
1955 జనవరి 5న జన్మించిన మమతా బెనర్జీ తొలి నుంచీ దూకుడుగానే వ్యవహరిస్తుంటారు. 1975 సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఆమె పార్టీలో వేగంగా ఎదిగారు. 1984లో బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో తొలిసారి పోటీచేసి.. సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడు సోమనాథ్‌ చటర్జీపై విజయంతో సంచలనం సృష్టించారు. 1989లో ఓడిపోయినా.. 1991 మధ్యంతర ఎన్నికల్లో గెలిచి పీవీ నరసింహారావు కేబినెట్‌లో కేంద్ర మానవ వనరులు, యూత్, క్రీడా శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. 1996 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలిచారు. అయితే కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలతో విభేదాలు రావడంతో.. 1997లో ముకుల్‌ రాయ్‌తో కలిసి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. మమతా బెనర్జీ 1998 డిసెంబర్‌లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ దుర్గా ప్రసాద్‌ను కాలర్‌ పట్టి వెనక్కి లాగేయడం సంచలనంగా నిలిచింది. తర్వాత మమత వరుసగా 1998, 1999, 2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2000లో ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వే శాఖకు తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో యూపీఏ సర్కారులో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి బెంగాల్‌లో ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున ఉద్యమం ప్రారంభించారు. సింగూరు, నందిగ్రామ్‌ పోరాటాలను ముందుండి నడిపారు. 2011లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016లో, తాజాగా మరోసారి తృణమూల్‌ను గెలిపించుకుని హ్యాట్రిక్‌ కొట్టారు.   

మరిన్ని వార్తలు