మారణహోమం.. బీజేపీ కుట్ర

12 Apr, 2021 01:11 IST|Sakshi

బెంగాల్‌ సీఎం మమత ఆరోపణ

లాఠీలకు పని చెప్పాల్సింది పోయి తుపాకులు ఎక్కుపెడతారా? 

ప్రతి బుల్లెట్‌కు ఓట్లతోనే సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపు 

ఎన్నికల ప్రచారంలో నల్లరంగు స్కార్ప్‌ ధరించి దీదీ నిరసన

రాజ్‌గంజ్‌/నాగ్రాకోట/చాల్సా: ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్న బీజేపీకి ఓటు వేయొద్దని ప్రజలకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ కుతంత్రం కారణంగానే కూచ్‌బెహార్‌ జిల్లాలో ఎన్నికల కేంద్రం వద్ద కాల్పులు జరిగాయని, అమాయకులు బలయ్యారని ఆరోపించారు. ఆమె ఆదివారం జల్పాయ్‌గురి జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. కాల్పులు జరిపిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను సమర్థిస్తూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవే కాల్పుల్లో బీజేపీ నాయకుల కుటుంబ సభ్యులు చనిపోతే ఇలాగే మాట్లాడేవారా? అని నిలదీశారు. ఎన్నికల కేంద్రం వద్ద ఎవరైనా అలజడి సృష్టిస్తే లాఠీలకు పని చెప్పాల్సింది పోయి తుపాకులు ఎక్కుపెట్టడం దారుణమని మండిపడ్డారు. కూచ్‌బెహార్‌ ఘటనను ప్రజాస్వామ్యం హత్యకు గురైన ఘటనగా మమతా బెనర్జీ అభివర్ణించారు. బీజేపీ కుట్ర కారణంగా కూచ్‌బెహార్‌ జిల్లాను సందర్శించేందుకు ఎన్నికల సంఘం తనకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తాను ప్రజల పక్షానే ఉంటానని స్పష్టం చేశారు. 

హామీలను మర్చిపోవడం బీజేపీకి అలవాటే 
ప్రతి బుల్లెట్‌కు ఓట్లతోనే సమాధానం చెప్పాలని బెంగాల్‌ ఓటర్లకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, అరాచక శక్తిగా మారిన బీజేపీని ఓడించాలని కోరారు. హామీలు ఇవ్వడం, మర్చిపోవడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. కూచ్‌బెహార్‌ జిల్లాలో కాల్పుల ఘటనకు నిరసనగా మమతా బెనర్జీ నల్లరంగు స్కార్ప్‌ ధరించారు. ఈ కాల్పుల్లో మరణించిన వారిని స్మరించుకుంటూ నాగ్రాకోటలో తాత్కాలికంగా నిర్మించిన స్థూపం వద్ద నివాళులర్పించారు. 

సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు 
కూచ్‌బెహార్‌ జిల్లాలోని సితాల్‌కుచీలో కాల్పుల ఘటనలో సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ సంఘటన ఒక మారణహోమం అని చెప్పారు. ఆమె ఆదివారం సిలిగురిలో మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నంలో భాగంగానే 72 గంటల పాటు రాజకీయ నాయకుల సందర్శనపై ఆంక్షలు విధించారని అన్నారు. దేశంలో అసమర్థ కేంద్ర ప్రభుత్వం, అసమర్థ కేంద్ర హోంమంత్రి ఉన్నారని ధ్వజమెత్తారు.ఎన్నికల సంఘం కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమే పని చేస్తోందని దుయ్యబట్టారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌(ఎంసీసీ)ను మోదీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌గా మార్చుకోవాలని ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ హితవు పలికారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్వీట్‌ చేశారు. ప్రజలకు అండగా నిలవడానికి, వారి బాధను పంచుకోవడానికి ప్రపంచంలోని ఏ శక్తి కూడా తనను ఆపలేదని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు