ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పెగాసస్‌

22 Jul, 2021 04:44 IST|Sakshi

కోల్‌కతా/న్యూఢిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ దేశంలో సంక్షేమానికి బదులుగా నిఘా దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలని, ఇందుకోసం విపక్షాలు అన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.

అమరవీరుల స్మృత్యర్థం బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్న మమత రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు ఇలా అన్ని వర్గాలపైన కేంద్రం నిఘా పెట్టినందుకు సుప్రీంకోర్టు దీనిని సూమోటోగా తీసుకొని విచారించాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్, డీజిల్, ఇతర వస్తువులపై వేసిన పన్నుల్ని ఇలాంటి ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌ల కొనుగోలుపై కేంద్రం ఖర్చు చేస్తోందని మమత ధ్వజమెత్తారు. ‘ విపక్ష నేతలందరి ఫోన్ల సంభాషణలు రికార్డు అయిపోతూ ఉంటాయి. అందుకే నేను ఫోన్‌లో ఎన్సీపీ నేత పవార్, కాంగ్రెస్‌ నాయకుడు చిదంబరం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడలేకపోతున్నాను. మా అందరి మీద ఇలా నిఘా పెట్టినంత మాత్రాన 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎవరూ కాపాడలేరు’’ అని అన్నారు.

స్వతంత్ర దర్యాప్తు జరపాలి: ఎడిటర్స్‌ గిల్డ్‌
ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వెంటనే సమగ్ర, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని  ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా(ఈజీఐ)  పేర్కొంది. ఈ మేరకు బుధవారం ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత పౌరుల ఫోన్లపై, వారి కదలికలపై భారత ప్రభుత్వ సంస్థలు దృష్టి పెట్టినట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంది. పాత్రికేయులపై సైతం నిఘా పెట్టడం అంటే అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని ఎడిటర్స్‌ గిల్డ్‌ స్పష్టం చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, పత్రికా స్వేచ్ఛను హరించే యత్నాలు చేయడం దారుణమని విమర్శించింది. పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వమే కాపాడకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించేదెలా? అని నిలదీసింది. ఎంక్వైరీ కమిటీలో జర్నలిస్టులకు, సామాజిక ఉద్యమకారులకు స్థానం కల్పించాలని సూచించింది.

ఫోన్‌ ట్యాపింగ్‌పై 28న విచారణ..!
పెగాసస్‌ ట్యాపింగ్‌పై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సన్నద్ధమయ్యింది. ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతోనూ మాట్లాడనున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీపై శశిథరూర్‌ నేతృత్వంలో ఏర్పాటైన 32 మంది సభ్యుల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 28న సమావేశం కానుంది. ‘సిటిజెన్స్‌ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ’ అజెండాతో భేటీ జరుగనుందని లోక్‌సభ సెక్రటేరియట్‌ వెల్లడించింది. ట్యాపింగ్‌పై విచారణకు రావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, హోంశాఖల ఉన్నతాధికారులకు స్టాండింగ్‌ కమిటీ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది.  

నా ఫోన్‌కి ప్లాస్టర్‌ వేశా
పెగాసస్‌ ప్రమాదకరమైనదన్న మమత... అందుకే తన ఫోన్‌ కెమెరాకు ప్లాస్టర్‌ వేశానంటూ దానిని చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్లాస్టర్‌ వెయ్యాలి. లేదంటే దేశం సర్వనాశనమైపోతుంది’ అని మమత అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, మీడియా అత్యంత ముఖ్యమైనవని, పెగాసస్‌ వలలో ఈ  మూడే చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ముందుకు వచ్చి సూమోటోగా విచారణ జరిపించాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మమత అన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు