గవర్నర్‌పై దీదీ సంచలన ఆరోపణలు

29 Jun, 2021 06:33 IST|Sakshi

ఆయనను పదవి నుంచి తొలగించాలి

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌

కోల్‌కతా: తమ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ పచ్చి అవినీతిపరుడని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికే ఆయన ఇటీవల ఉత్తర బెంగాల్‌లో పర్యటించారని మండిపడ్డారు.  ఆమె  మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్‌ ధన్‌కర్‌ అవినీతిపరుడు. 1996 నాటి జైన్‌ హవాలా కేసు చార్జీషీట్‌లో ఆయన పేరు ఉంది. అవినీతి మకిలి అంటిన ఇలాంటి గవర్నర్‌ను ఇంకా ఎందుకు పదవిలో కొనసాగిస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలి’అని మమత డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ను› తొలగించాలని  కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, అయినా స్పందించలేదని విమర్శించారు.  

ఆ ఆరోపణలు నిరాధారం: గవర్నర్‌  
సీఎం మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని, తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని గవర్నర్‌  ధన్‌కర్‌ దుయ్యబట్టారు.  ఒక ముఖ్యమంత్రి తరహాలో మమత వ్యవహరించడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తాను చేయాల్సిన ప్రసంగంలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తానని, అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జైన్‌ హవాలా కేసుకు సంబంధించిన ఏ చార్జిషీట్‌లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఆరోపణలు నిరాధారమని చెప్పారు.  

మరిన్ని వార్తలు