బెంగాల్‌ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం

5 May, 2021 10:49 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్‌ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో  ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం వేదికపైనే గవర్నర్‌, మమతా పోటాపోటీ విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలో హింస చెలరేగిపోతోందన్నారు. సీఎం మమత హింసను నియంత్రించాని గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ తెలిపారు. కొత్త ప్రభుత్వంలో శాంతి నెలకొనేలా మమత పని చేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం ఎన్నికల సంఘం పరిధిలో ఉందని సీఎం మమత అన్నారు. ప్రస్తుతం నెలకొన్నా పరిస్థితులు  ఎన్నికల సంఘం, గవర్నర్‌ కారణమన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమ హయాంలో బెంగాల్‌ ప్రశాంతంగా ఉంటుందన్నారు.

ఇటీవల జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయంతో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో మమత బెనర్జీ మూడోసారి బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక రేపు(గురువారం) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో పోటీచేసిన మమతా బెనర్జీ తన సమీప బీజేపీ అభ్యర్థి సువేంధు అధికారి చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. పశ్చిమబెంగాల్‌లో శాసనమండలి ఉండి ఉంటే మమత వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండేది. కాకపోతే అక్కడ శాసనమండలి లేకపోవడంతో ఇప్పుడు విధిగా ఆమె ఆరో నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిందే.

చదవండి: కరోనా: దేశంలో కొత్తగా 3,82,315 కేసులు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు