మూడోసారి బెంగాల్‌ పీఠంపై దీదీ

6 May, 2021 04:35 IST|Sakshi

పశ్చిమబెంగాల్‌ సీఎంగా మమతతో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ధన్‌కర్‌

కోవిడ్‌పై పోరాటం కొనసాగిస్తానన్న మమతా బెనర్జీ

కోల్‌కతా: హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయఢంకా మోగించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్‌ సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ ఆమెతో సీఎంగా ప్రమాణంచేయించారు. మమత కేబినెట్‌లో కొత్త మంత్రులంతా 9వ తేదీన ప్రమాణం చేయను న్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత హింస చెలరేగడానికి కారకులైన వారిని వదిలిపెట్టేదిలేదని ఈ సందర్భంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్‌లో కోవిడ్‌ కట్టడే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మమత స్పష్టంచేశారు. కాగా, సీఎంగా ప్రమాణంచేసిన మమత దీదీకి అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.  దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తూ ప్రధాని మోదీకి మమత ఓ లేఖ రాశారు.

అల్లర్లను చెల్లెలు మమత అదుపుచేయగలదు: గవర్నర్‌ ధన్‌కర్‌
‘మూడోసారి సీఎం అయిన మమతకు ధన్య వాదాలు. అయితే, ప్రస్తుతం అల్లర్లు, హింసతో బెంగాల్‌ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ హింసా త్మక ఘటనలకు నా సోదర సమానురాలైన మమతా బెనర్జీ అడ్డుకట్ట వేయగలదనే నమ్ముతున్నా. హింసకు గురౌతున్న మహిళలు, చిన్నారులను రక్షించి తక్షణమే శాంతిభద్రతలను ఆమె అదుపులోకి తెస్తారని భావిస్తున్నా’అని గవర్నర్‌ ధన్‌కర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు