-

అధినాయకి వర్సెస్‌ అధికారి

20 Mar, 2021 04:33 IST|Sakshi
మమతా బెనర్జీ, సువేందు అధికారి

నందిగ్రామ్‌లో సమఉజ్జీల సమరం

అందరి చూపు అటువైపే 

ఒకవైపు దెబ్బతిన్న పులిలా గాండ్రిస్తున్న అధినాయకి

మరోవైపు వన్‌ మ్యాన్‌ ఆర్మీలా ఢీ కొడుతున్న అధికారి 

ఒకరిది ఉద్యమ బాట, మరొకరిది వ్యక్తిగత చరిష్మా

బెంగాల్‌కే కూతురునని ఒకరు.. కుటుంబానికే ఎదురులేదని మరొకరు

మధ్యలో పునర్‌వైభవం కోసం కమ్యూనిస్టుల ప్రయత్నాలు

వ్యూహ ప్రతివ్యూహాలతో వేడెక్కుతున్న నందిగ్రామ్‌లో గెలుపెవరిది ?

సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం నందిగ్రామ్‌ పేరు తొలిసారిగా వార్తల్లోకెక్కింది. సెజ్‌ల ఏర్పాటు కోసం రైతుల నుంచి భూసేకరణకు నిరసనగా నందిగ్రామ్‌లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ సెగలు దేశం నలుమూలలకీ పాకాయి. పోలీసు కాల్పుల్లో 14 మంది రైతులు మరణించడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నదాతలకు అండగా నిలిచి ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. నందిగ్రామ్‌ వేదికగా నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటమే చేసి కాలం మారింది కామ్రేడ్స్‌ అని గర్జిస్తూ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కంచుకోటని బద్దలు కొట్టారు. మళ్లీ ఇన్నేళ్లకి మమత నందిగ్రామ్‌ అసెంబ్లీ బరిలో దిగడంతో దేశవ్యాప్తంగా మరోసారి నందిగ్రామ్‌ పేరు మారుమోగుతోంది. ఇన్నాళ్లూ తనకి కుడి భుజంగా ఉంటూ గత డిసెంబర్‌లోనే బీజేపీలో చేరిన సువేందు అధికారి సవాల్‌ని స్వీకరించి మరీ నందిగ్రామ్‌ బరిలో మమత దిగడంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ సంగ్రామం వేడెక్కింది.

వ్యూహ ప్రతివ్యూహాలు
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన సమయంలో కాలికి అయిన గాయాన్ని తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీల్‌చైర్‌ మీదే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ సానుభూతి ఓట్లు దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ తనని నాలుగ్గోడల మధ్య పరిమితం చేయడానికే నందిగ్రామ్‌లో తనపై దాడికి దిగిందని ఆరోపిస్తున్నారు. తన గెలుపు కోసం పూర్ణేందు బసు అనే సీనియర్‌ మంత్రిని ప్రత్యేకంగా నియమించారు. పూర్ణేందు అధికారి సాక్షితో మాట్లాడుతూ మమతా బెనర్జీ చేపట్టిన సంక్షేమ పథకాలే ఆమెని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మమతను వెన్ను పోటు పొడిచి పార్టీ వీడిన సువేందు అధికారి తప్పు చేశారని, ఆయన చేసిన తప్పులే దీదీకి ఓట్లను కురిపిస్తాయని అన్నారు. నందిగ్రామ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారి చేసిన అవినీతి పనులే ఆయనని ఓటమి పాలు చేస్తాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ ధోలాసేన్‌ జోస్యం చెప్పారు.

నందిగ్రామ్‌లో మహిళలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. తరచుగా ఉద్యమాల్లో పాల్గొంటారు. 49 శాతం ఓట్లు ఉన్న మహిళా ఓటర్లు మమతకే అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి వన్‌ మ్యాన్‌ ఆర్మీగా దూసుకుపోతున్నారు. 2016 ఎన్నికల్లో 67% ఓట్లు కొల్లగొట్టిన సువేందు అ«ధికారి కుటుంబానికి ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. సువేందు అధికారి తండ్రి, సోదరుడు కూడా ఎంపీలుగా పని చేశారు. జూట్‌ మిల్లు కార్మిక కుటుంబాలతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. నందిగ్రామ్‌ నియోజకవర్గం ఉన్న మిడ్నాపూర్‌ ఉమ్మడి జిల్లాలో వీరి కుటుంబానికి ఎదురే లేదు. హిందూ ఓట్లను ఏకం చేయడంతో పాటుగా ముస్లిం ఓట్లను రాబడితే గెలుపు ఖాయమన్న ధీమాలో అధికారి ఉన్నారు. బీజేపీకి కేడర్‌ లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. సమఉజ్జీల మధ్య సమరంలో ముస్లింలు, కమ్యూనిస్టు ఓటు బ్యాంకుపైనే వారి గెలుపు ఆధారపడి ఉంది.   

ముస్లిం ఓటు బ్యాంకు ఎటు ?  
నందిగ్రామ్‌ నియోజకవర్గంలో 30% ఉన్న ముస్లింలు ఈ సారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ముస్లింలు మొదట్లో కమ్యూనిస్టులకు అండగా ఉండేవారు. 2007లో జరిగిన భూ సేకరణలో భూములు కోల్పోయిన వారు మమతకి మద్దతుగా నిలిచారు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సువేందు అధికారి తనకున్న వ్యక్తిగత పరిచయాలతో ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక సీపీఎం, కాంగ్రెస్, ఐఎస్‌ఎఫ్‌ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఐఎస్‌ఎఫ్‌ నాయకుడు అబ్బాస్‌ సిద్ధి్దఖికి నందిగ్రామ్‌లో గట్టి పట్టు ఉంది. ఆయన ప్రభావంతో ముస్లింలు తిరిగి కమ్యూనిస్టుల వైపు మళ్లితే మమతా బెనర్జీ గెలుపు అవకాశాలు ప్రమాదంలో పడిపోతాయి.  

హిందూత్వ కార్డు  
నందిగ్రామ్‌లో 70% హిందూ ఓట్లన్నీ గంపగుత్తలా తమకే పడేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీ కరడుగట్టిన హిందూత్వ వాదాన్ని ఎదుర్కోవడానికి మమత కూడా హిందూత్వ బాట పట్టారు. గుళ్లు గోపురాలు తి రుగుతూ, ఎన్నికల ర్యాలీల్లో శ్లోకాలు వల్లె వేస్తున్నారు. తమదీ హిందూ కుటుంబమే అని చెబుతున్నారు. బ్రాహ్మణ్‌ సమ్మేళన్‌ నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తూ దుర్గా పూజ కమిటీలకు సాయం చేస్తున్నారు. హిందువుల్లో వైçష్ణవ ఓటర్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వీరు తులసిమాల ధరిస్తారు. విభూదిని బొట్టుగా పెట్టుకుంటారు. మమత గెలిస్తే విభూది పెట్టుకోవాలన్నా అనుమతి తీసుకోవాలంటూ సువేందు ప్రచారం చేస్తున్నారు.  

మత్స్యకారుల పాత్ర
హుగ్లీ నది సముద్రంలో కలిసే ప్రాంతం నందిగ్రామ్‌లో ఉంది. దీంతో ఇక్కడ భారీ సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సముద్రపు నీటిని చట్టవిరుద్ధంగా కాలువల ద్వారా గ్రామాల్లోకి తీసుకువచ్చి వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రొయ్యల సాగుని అడ్డుకుంటామని మమత ప్రభుత్వం చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. సువేందు అధికారి రొయ్యల వ్యాపారుల సిండికేట్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఈ మత్స్యకారుల్లో దళితులు, ముస్లింలు కూడా ఎక్కువే ఉన్నారు. వీరంతా అధికారి వైపే ఉంటారన్న అంచనాలున్నాయి.  

సీపీఎం ప్రభావం ?
నందిగ్రామ్‌లో సీపీఎం ప్రభావం ఎన్నికల్లో కీలకం కానుంది. చాలా ఏళ్లు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట. 2007లో జరిగిన కాల్పుల ఘటనతో వారి ఇమేజ్‌ బాగా డ్యామేజ్‌ అయింది. కేడర్‌ పెద్ద సంఖ్యలో పార్టీని విడిచి వెళ్లిపోయారు. అయితే టీఎంసీ అధికారంలోకి వచ్చాక సీపీఎం నాయకులపైనా, కార్యకర్తలపైనా దాడులు జరగడంతో మమతపై వారంతా గుర్రుగా ఉన్నారు. వీరు 2019 లోక్‌సభ ఎన్నికల్లో  బీజేపీకి ఓటు వేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. సీపీఎం విద్యార్థి నాయకురాలైన మీనాక్షి ముఖర్జీ  పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీకి దిగింది.  వాక్పటిమ కలిగిన మీనాక్షి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.  కమ్యూనిస్టులు తమ ఓటు బ్యాంకును తిరిగి కొల్లగొడితే సువేందు అధికారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి.  

– నందిగ్రామ్‌ నుంచి సాక్షి ప్రతినిధి  

మరిన్ని వార్తలు