ఓడిపోయిన మమతాకు ఉన్న ఒకేదారి ఏమిటో తెలుసా..?

3 May, 2021 20:49 IST|Sakshi

కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లో మూడోసారి అద్భుత మెజార్టీ స్థానాలతో అధికారంలోకి వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోవడం షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 217 ఎమ్మెల్యేలు గెలిచారనే సంతోషం మమతాకు లేకుండాపోయింది. అయితే ఆరు నెలల వరకు మమతాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారానికి ఎలాంటి అడ్డు లేదు. కాకపోతే ఆరు నెలల వరకు ఎలాగైనా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నికై ఉండాలి.

లేకపోతే ఆమె ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అవకాశాన్ని కోల్పోతుంది. శాసనమండలి పశ్చిమబెంగాల్‌లో లేకపోవడంతో ఎమ్మెల్సీగా ఉండి ఉంటే మమత వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండేది. కాకపోతే అక్కడ శాసనమండలి లేకపోవడంతో ఇప్పుడు విధిగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిందే. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ ముందు ఉన్న ఒకే మార్గం ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే కావాల్సిందే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు.

కరోనా తీవ్రంగా ఉండడంతో పశ్చిమబెంగాల్‌లోని సంసర్‌గంజ్‌, ముర్షిదాబాద్‌ స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్‌ నిర్వహించలేదు. ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట మమత పోటీ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకచోట మమత గెలిస్తే ముఖ్యమంత్రిగా సేఫ్‌గా ఉంటుంది. లేకపోతే ఆమె స్థానంలో మరొకరిని నియమించాల్సి వస్తుంది. అయితే రెండు స్థానాలు కాబట్టి బీజేపీ తీవ్ర శక్తులు ఒడ్డి మమతాను ఓడించే ప్రయత్నం చేస్తుంది. తాజా ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కన్నా మమతను నందిగ్రామ్‌లో ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. మమతను ఓడిస్తామని చేసిన శపథం నెరవేర్చుకుంది. ఇప్పుడు ఈ రెండు స్థానాలకు జరిగే ఎన్నికలపై ఇప్పటికే బీజేపీ దృష్టి సారించింది. మమతను ఓడించి మరొకసారి మమతకు షాకిచ్చేలా వ్యూహం రచిస్తోంది.

చదవండి: అన్ని చోట్ల గుబాళింపు: టీఆర్‌ఎస్‌లో డబుల్‌ జోష్‌
చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు