ఎంపీని అడ్డంగా పడుకోబెట్టాలన్న మాజీ సీఎం.. నటుడి ఫ్యాన్స్‌ ఆగ్రహం

9 Jul, 2021 08:22 IST|Sakshi
Photo Courtesy: Social Media

కుమార–అంబి ఫొటోపై చర్చ

సాక్షి, బెంగళూరు: దివంగత నటుడు అంబరీశ్‌ ముందు జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై కుమార గురువారం స్పందిస్తూ నేను ప్రజల ముందు కూడా చేతులు కట్టుకుని నిలబడతాను, ఈ విషయానికి అంత ప్రాధాన్యం అవసరం లేదు అన్నారు. ఆడపిల్లపై ప్రస్తుతం చర్చ వద్దని, ఎన్నికల సమయంలో మాట్లాడతానని ఎంపీ సుమలతను ఉద్దేశించి అన్నారు.  

కాగా ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్‌ గురించి కుమారస్వామి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మండ్య జిల్లాలోని  కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇందుకు సుమలత ఘాటుగానే స్పందించారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని చురకలు అంటించారు.

అదే విధంగా కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ విషయం గురించి మాట్లాడుతూ.. కుమారస్వామి అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని, మండ్యా జిల్లాలోని శ్రీరంగ పట్టణ తాలుకాలో అక్రమ గనుల తవ్వకాలు తాను ఆపేయాలని ఆదేశించినట్లు సుమలత పేర్కొన్నారు. ఈ విషయంలో కుమారస్వామి అవినీతి వైపు నిలబడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కుమారస్వామి వర్సెస్‌ సుమలత అన్నట్లుగా అనుచర వర్గాలు సోషల్‌ మీడియాలో మాటల యుద్ధానికి  తెర తీశారు. ఈ నేపథ్యంలో సుమలత- అంబరీష్‌ ఫ్యాన్స్‌ కుమార- అంబి పాత ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘పులి ముందు ఎవరు ఎలుకలా నిలబడ్డది ఎవరు? ఇప్పుడు ఆయన మహిళల గురించి ఏం మాట్లాడుతున్నారు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు