సీఎంకు మరో తలనొప్పి : రంగంలోకి కొత్త పార్టీ

15 Feb, 2021 15:04 IST|Sakshi

కేరళ ఎన్‌సీపీ నేత మణి సీ కప్సన్‌ కొత్త పార్టీ

10 సభ్యులతో కమిటీ, త‍్వరలోనే పార్టీ, చిహ్నం వెల్లడి

సాక్షి, తిరువనంతపురం : రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలనేపథ్యంలో కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేరళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)నేత మణి సీ కప్సన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త పార్టీ ఆవిర్భావానికి  రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు గాను ఒక కమిటీనీ ఏర్పాటు చేశారు. కేరళలో అధికార కూటమి ఎల్‌డీఎఫ్‌లో భాగంగానున్న ఎన్‌సీపీకి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్‌)లో చేరిన అనంతరం తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. కప్పెన్ కొత్త పార్టీ, 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో 25వ రాజకీయ పార్టీగా అవతరించనుంది.

కొత్త పార్టీ యోచనలో భాగంగా 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.  మణి సీ కప్సన్‌ అధ్యక్షతన  ఏర‍్పడిన కమిటీ  పార్టీ పేరు, చిహ్నం ఎంపికపై  కసరత్తు చేస్తోంది.  ఈ వారాంతంలో పార్టీ పేరు తదితర వివరాలు వెల్లడికానున్నాయని అంచనా. ఏడు జిల్లాల ఎన్‌సీపీ అధ్యక్షులు, రాష్ట్ర క్యాడర్‌లోని తొమ్మిది మంది నేతల మద్దతు ఉన్నట్టు ప్రకటించుకున్న ఎమ్మెల్యే మణి సీ కప్పన్ యూడీఎఫ్‌లో చేరారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల నేతృత్వంలోని ఐశ్వర్య కేరళ యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ నేత  కేఎం మణి మరణించడంతో, పాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఉపఎన్నికల్లో మణి సీ కప్పన్ ఎల్‌డీఎఫ్ టిక్కెట్ పై గెలిచారు. అయితే, రానున్న ఎన్నికల్లో పాల స్థానంలో టికెట్‌ను వేరే అభ్యర్థి ఇవ్వనున్నట్టు సీపీఐ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ నిర్ణయించడం ఎన్‌సీపీ ఎమ్మెల్యే మణి సీ కప్పన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి గుడ్‌పైచెప్పి యూడీఎఫ్‌లో చేరారు. ఆదివారం ఐశ్వర్య ర్యాలీలో మాట్లాడిన ఆయన  ఎల్‌డీఎఫ్‌కు అధికారం దక్కదని,  రాష్ట్రంలో ఈ పార్టీకి కాలం చెల్లినట్టేనని వ్యాఖ్యానించడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న సీపీఐ(ఎం) నేతృత్వంలోని అధికార ఎల్​డీఎఫ్‌కు ఎదురు దెబ్బ తగలనుంది.

మరిన్ని వార్తలు