ఠాకూర్‌తో తాడోపేడో తేల్చుకుంటాం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

12 Dec, 2020 14:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ పదవిపై కాంగ్రెస్‌లో హీట్‌ పెరిగింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అంశంపై అభిప్రాయసేకరణ కొనసాగుతుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్యం ఠాకూర్‌ దీనిపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆయనను సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీ శనివారం కలిశారు. (చదవండి: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్‌)

అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా సరే ఏకాభిప్రాయంతోనే జరగాలని.. వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటే పార్టీకే నష్టమని స్పష్టం చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారినే అధ్యక్షుడ్ని చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ను రోడ్డుపాలు చేసే కుట్ర జరుగుతోందని, సోనియా, రాహుల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఠాకూర్‌తో తాడోపేడో తేల్చుకుంటామని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. (చదవండి: పీసీసీ ఇస్తే పార్టీని గాడిలో పెడతా: కోమటిరెడ్డి)

‘‘కాంగ్రెస్ పార్టీలో అన్ని మామూలే సీఎల్పీలో సమావేశం ఎందుకు అనేది బయటకు చెప్పలేను.ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ చీలిపోకుండా ఉండేందుకు ఇంచార్జ్ ఠాకూర్‌ను కలిశాం. ఎమ్మెల్యేలు, ఎంపీ కోమటిరెడ్డితో కలిసి మా మనసులో ఉన్నది చెప్పాం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వివరించాం. రేపు చాలా ఎన్నికలు రాబోతున్నాయి. వాటిని ఎదుర్కొవాలి. ఠాగూర్ అన్ని వివరించాం. ఆయన అన్ని నోట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతుంది అందరికీ తెలిసిందే. ప్రజలు అన్ని గమనించాలి.

సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవద్దు. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లేది ఇప్పుడే చెప్పలేం. సీఎల్పీ, పీసీసీ అధ్యక్షుడిని మేము ఇన్వాల్వ్ చేయడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఎంపిక మెజార్టీ అభిప్రాయం కాకుండా.. ఏకాభిప్రాయం సాధించాలి. ఒక ఇంచార్జ్ జిల్లా స్థాయి నేతలతో మాట్లాడటం తప్పు కాదు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు.. మా అభిప్రాయం చెప్పాం. ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ.. కలిశాం. జరుగుతున్న ప్రచారం దృష్ట్యా.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పాం. ఏకాభిప్రాయంతో్ ఎలాంటి పేరు చెప్పలేదు. సోనియాగాంధీ.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని’’ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు