కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాణిక్కం ఠాగూర్ సీరియస్..!

27 Jun, 2021 21:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు నేపథ్యంలో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సీరియస్‌ అయినట్లు తెలిసింది. సీనియర్లకు ఫోన్‌ చేసి.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న కోమటిరెడ్డి.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపై తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో ఎలా లాబీయింగ్ చేశాడో.. పీసీసీ పదవిని కూడా అలాగే తెచ్చుకున్నాడని రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పీసీసీ పదవిని రాష్ట్ర ఇంఛార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరికాదు: మల్లు రవి
టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. అధిష్టానం ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని రోజుల తరబడి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డి నియామకం విషయంలో కోమటిరెడ్డి.. టీపీసీసీ ఇంచార్జి మణిక్కం ఠాగూర్‌ను నిందించడం పార్టీ క్రమశిక్షణ రాహిత్యమన్నారు. ఏదైనా అభిప్రాయబేధాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించాలని మల్లు రవి అన్నారు.

చదవండి: రేవంత్‌కు పోస్ట్‌: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు 
అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్‌!

మరిన్ని వార్తలు