పార్టీలో నేను ఎవరికీ అనుకూలం కాదు.. వ్యతిరేకం కాదు: మాణిక్‌రావు ఠాక్రే 

22 Jan, 2023 04:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 26న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలను లాంఛనంగా ప్రారంభించి ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలలపాటు ఈ యాత్రలను ఘనంగా కొనసాగించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ‘ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా యాత్రలను ప్రారంభించాలి. ఆ తర్వాత 30న శ్రీనగర్‌లో జరిగే భారత్‌ జోడో యాత్ర ముగింపునకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతోపాటు ముఖ్య నేతలు అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ సమావేశం ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. 5న రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6 నుంచి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలను రెండు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలి’ అని సమావేశం తీర్మానించింది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే అధ్యక్షతన శనివారం టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం గాంధీ భవన్‌లో జరిగింది.

ఈ సమావేశానికి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల కోసం ఏఐసీసీ నియమించిన సమన్వయకర్త గిరీశ్‌ చోడంకర్, పీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్‌చార్జి కార్యదర్శులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగానే హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల నిర్వహణపై పలువురు నేతలు మాట్లాడారు. అందరి అభిప్రాయాలను తీసుకున్నాక మాణిక్‌రావ్‌ ఠాక్రే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ తనకిచ్చిన బాధ్యతల నిర్వహణ, పార్టీ భవిష్యత్తు, నేతల పనితీరు, హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల నిర్వహణ, ఎన్నికలను ఎదుర్కొనే అంశాలపై కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆయన మార్గదర్శనం చేశారు.

పార్టీ బాగుంటేనే మీ భవిష్యత్తు బాగు..
‘భారత్‌ జోడో యాత్రతో ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు రాహుల్‌గాంధీ కృషి చేస్తున్నారు. ఈ యాత్ర లక్ష్యాన్ని రాష్ట్రంలో ప్రతి గడపకూ తీసుకెళ్లే బాధ్యత మీ అందరిదీ. అలాగే అందరూ సమష్టిగా పనిచేసి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలను విజయవంతం చేయాలి. పార్టీ భవిష్యత్తు బాగుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలి. పార్టీ అంతర్గత విషయాలు ఏవైనా నాతో మాట్లాడండి. నేను ఎవరికీ అనుకూలం కాదు... వ్యతిరేకమూ కాదు. నేతలెవరూ పార్టీకి నష్టం కలిగేలా మీడియా ముందు మాట్లాడొద్దు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల్లో భాగంగా సీనియర్లు ఎక్కువ నియోజకవర్గాల్లో యాత్రలు చేయాలి. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి కూడా 40–50 నియోజకవర్గాల్లో యాత్రల్లో పాల్గొంటారు. మనం బలహీనపడుతున్నామనే భావనతో బీజేపీ ఉత్తరాదిన చేస్తున్న రాజకీయాలనే తెలంగాణలో చేయాలని చూస్తోంది. కానీ బీజేపీ ఆటలు సాగవు. 100 శాతం మనం గెలవబోతున్నాం’ అని ఠాక్రే పీసీసీ కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

సమావేశాలకు రాని వారిపై చర్యలు..
కార్యవర్గ సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి 6న జరిగే హాథ్‌ సే హాథ్‌ జోడో పాదయాత్రల ప్రారంభ కార్యక్రమంలో సోనియా లేదా ప్రియాంకా గాంధీల్లో ఒకరు పాల్గొనేలా చూడాలని ఠాక్రేను కోరారు. లక్ష మందితో జరిగే ఈ సభలో వారిద్దరిలో ఒకరిని పాల్గొనాలని కోరుతూ ఏఐసీసీ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే కొత్త ఇన్‌చార్జి ఠాక్రే వచ్చాక నిర్వహించిన సమావేశాలకు హాజరుకాని వారి నుంచి వివరణ కోరాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను రేవంత్‌ ఆదేశించారు. 

గడపగడపకూ ‘భారత్‌జోడో’ స్టిక్కర్, రాహుల్‌ లేఖ
సాక్షి, హైదరాబాద్‌: హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర లను రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. బ్లాక్‌లు యూనిట్‌గా అన్ని గ్రామాల్లో యాత్రలు నిర్వహించనుంది. ఈ యాత్రల్లో ప్రతి గడపకూ భారత్‌జోడో యాత్ర స్టిక్కర్‌ అంటించాలని, తన యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు రాసిన లేఖను తెలుగులో అనువదించి అందరికీ ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ వేసే చార్జిషీట్లను కూడా గ్రామగ్రామాన పంచాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు