మాణిక్‌రావ్‌ రాకతోనైనా ‘మారేనా’?

6 Jan, 2023 04:03 IST|Sakshi

గ్రూపు తగాదాల పరిష్కారమే ఇన్‌చార్జి ముందున్న సవాల్‌

వచ్చే వారం తెలంగాణకు రాక! 

సాక్షి, హైదరాబాద్‌: మాణిక్యం ఠాగూర్‌ మారారు.. మాణిక్‌రావు ఠాక్రే వస్తున్నారు.. మరి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మారుతుందా? మాణిక్యం కుదర్చలేని సమన్వయం మాణిక్‌రావ్‌తో సాధ్యమవు తుందా? మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లపాటు పనిచేసిన అనుభవంతో తెలంగాణ కాంగ్రెస్‌కు ఆయన ఎలాంటి చికిత్స చేయబోతున్నారనేది ఇప్పుడు టీకాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరు ణంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే రాకతోనైనా తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి మారుతుందా అని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌లో ఒకప్పుడు కీలకనేతగా గుర్తింపు పొందిన మాణిక్‌రావ్‌ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరని తెలుస్తోంది. తన పని తాను చేసుకుని పోతున్న తరుణంలో అధిష్టా నం వెతికి మరీ తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యతలు అప్పజెప్పడానికి గల కారణమేంటనేది కూడా చర్చనీయాంశమైంది.

గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరున్న  ఠాక్రే ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడటం, సొంత పార్టీలో పరిస్థితులను చక్కబెట్టడంలో దిట్ట అని, తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కృషి చేశారనే చర్చ జరుగుతోంది. శరద్‌పవార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మహారాష్ట్ర హోంమంత్రిగా పనిచేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో పాలనానుభవం కూడా ఉందని గాంధీభవన్‌ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ముందున్న ప్రధాన సవాల్‌ అయిన తెలంగాణ కాంగ్రెస్‌లోని గ్రూపు తగాదాలను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.  

వచ్చేవారం రాక.. 
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి హోదాలో మాణిక్‌రావ్‌ ఠాక్రే వచ్చేవారం తెలంగాణకు రానున్నారని తెలుస్తోంది. వచ్చీరాగానే పార్టీ ముఖ్య నేతలందరినీ కలుస్తారని సమాచారం. కాగా, కొత్త ఇన్‌చార్జితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ఫోన్‌లో మాట్లాడారని, పార్టీ ఇన్‌చార్జిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు తెలంగాణకు రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది.    

మరిన్ని వార్తలు