వీడిన సస్పెన్స్‌.. మణిపూర్‌ సీఎంగా మళ్లీ బీరెన్‌ సింగ్‌

20 Mar, 2022 18:11 IST|Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఎట్టకేలకు సస్పెన్స్‌ వీడింది. ప్రస్తుతం అపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న బీరెన్‌సింగ్‌(61)ను.. మణిపూర్‌ సీఎంగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. 

రాజధాని ఇంఫాల్‌లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా బీరెన్‌ సింగ్‌కు ఓటు పడింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, కిరెన్‌ రిజ్జు చర్చలతో సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరోసారి మణిపూర్‌ సీఎంగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.. బీరెన్‌ సింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.  


 
ఇక గడిచిన ఎన్నికల్లో ఎన్. బీరెన్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి పంగీజం శరత్‌చంద్ర సింగ్‌పై 18 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. హెయ్గాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన గెలుపొంది, ఐదోసారి ఎమ్మెల్యేగా బీరెన్‌ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

జర్నలిస్ట్‌ కూడా..

బీరెన్ సింగ్ Nongthombam Biren Singh రాజకీయాల్లోకి రాక ముందు ఫుట్‌బాల్ క్రీడాకారుడుగా రాణించారు. కొన్నాళ్లు జర్నలిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆయా రంగాల్లో తనదైన గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2016 అక్టోబర్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌పై జరిగిన తిరుగుబాటులో సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత 17 అక్టోబర్ 2016న బీజేపీలో చేరారు. మరుసటి ఏడాదే రాష్ట్ర ఎన్నికల తర్వాత సీఎం అయ్యారు.

కాగా 60 అసెంబ్లీ సీట్లు ఉన్న రెండు మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 31 కాగా.. బీజేపీ 32 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఈ విజయంలో బీరెన్‌ సింగ్‌ నాయకత్వమే ముఖ్యభూమిక పోషించింది.

మరిన్ని వార్తలు