బీజేపీలో ‘మణి’పూస: కౌన్సిలర్‌ నుంచి అధ్యక్షురాలిగా..

1 Feb, 2022 12:37 IST|Sakshi

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువ. అయినప్పటికీ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా వారికి తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అలాంటి సమయంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా బీజేపీ తొలిసారిగా ఒక మహిళకి రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని పెంచేలా శారదాదేవి మణిపూర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మహిళా నేతలు పెద్దగా కనిపించడం లేదు. మణిపూర్‌లో మాత్రం అన్నీ తానై, అంతటా తానై శారద బీజేపీ గెలుపు భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్నారు.

► శారదా దేవి 1995 జూన్‌లో భారతీయ జనతా పార్టీలో చేరారు 

► ఇంఫాల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేసి వార్డు నెం.7 నుంచి కౌన్సిలర్‌గా గెలిచారు 

► బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహించారు. 1997–2000 వరకు జాతీయ కార్యదర్శిగా సేవలు అందించారు. 2010–2012 వరకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.  (క్లిక్: ఆ పార్టీకి బలమూ ఆయనే.. బలహీనత ఆయనే)

► 2012–2016 వరకు జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.  

► మణిపూర్‌ రాష్ట్ర రాజకీయాల్లో మొదట్నుంచీ చురుగ్గా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ, టికెట్‌ కమిటీలో 1998 సంవత్సరం నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నారు.  

► మణిపూర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.టికెన్‌ కోవిడ్‌–19 బారిన పడి గత ఏడాది మేలో మరణించారు. దీంతో శారద 2021, జూన్‌లో బీజేపీ రాష్ట్ర తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.  

► బహుముఖ పోటీ నెలకొన్న మణిపూర్‌లో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి వ్యూహాత్మకంగానే బీజేపీ ఎన్నికలకు ముందు సంవత్సరం ఒక మహిళని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టిందన్న విశ్లేషణలున్నాయి. (క్లిక్: పొలిటికల్‌ ప్లేయర్‌.. ప్రత్యర్థులతో ఫుట్‌బాల్‌ ఆడేయగలరు)

► రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 20,34,966 ఉంటే వారిలో పురుష ఓటర్లు 9,85,119 మంది ఉంటే మహిళా ఓటర్లు 10,49,639 ఉన్నారు. అంటే మహిళా ఓటర్లు 64 వేల మంది ఎక్కువ ఉన్నట్టు లెక్క. ప్రతీ నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లు కీలకమైన నేపథ్యంలో శారదా దేవి నియామకం పార్టీకి కలిసి వస్తుందన్న భావనలో బీజేపీ ఉంది.  

► మొత్తం 60 స్థానాలున్న రాష్ట్రంలో తాను చెప్పిన వారికి టికెట్లు ఇస్తే 40 సీట్లలో విజయం ఖాయమని శారదా దేవి చెప్పారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం లేదు. 2017 ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు.  

► శారద పట్టుబట్టి ముగ్గురు మహిళా అభ్యర్థులకి టికెట్లు ఇప్పించారు.  

► ఇప్పటికే బహుముఖ పోటీ నెలకొనడంతో పాటు టికెట్ల పంపిణీ తర్వాత బీజేపీలో ఒక్కసారిగా అసమ్మతి సెగ రాజుకుంది. టికెట్లు రాని వాళ్లు పార్టీ కార్యాలయం మీద కూడా దాడులకు దిగారు. కొందరు పార్టీకి కూడా గుడ్‌బై కొట్టేశారు.  

► పార్టీలో అసమ్మతిదారుల్ని బుజ్జగించడంతో పాటు  40 సీట్ల లక్ష్యాన్ని సాధించడం అంటే శారదా దేవి గట్టి సవాల్‌ కిందే లెక్క. అయినా ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంగా  శ్రేణుల్ని ఉత్తేజపరిచే పనిలో ఉన్నారు. కార్యకర్తలతో అరమరికలు లేకుండా కలిసిపోయే తత్వం ఆమెది. అదే ఇప్పుడు బీజేపీని క్షేత్రస్థా యిలో పటిష్టపరుస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి    

మరిన్ని వార్తలు