తొలగింపు డిమాండ్‌ వేళ.. ఏం జరుగుతుందో చెప్పలేమన్న మణిపూర్‌ సీఎం బీరెన్‌

26 Jun, 2023 15:15 IST|Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ హింసపై ఆ రాష్ట్రముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. పరిస్థితి మాత్రం అల్లకల్లోలంగానే ఉందని వెల్లడించారాయన. బీరెన్‌ను తప్పించాలనే డిమాండ్‌ ఊపందుకోవడం, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు డిమాండ్ల నేపథ్యంలో.. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు సీఎం బీరెన్‌. మణిపూర్‌ అల్లర్లపై నివేదిక సమర్పించి.. తిరిగి అర్ధరాత్రి స్వరాష్ట్రానికి ఆయన చేరుకున్నారు. 

‘‘మణిపూర్‌ అల్లర్లు మొదట రాజకీయ వేడితో ముందుకు సాగింది. సున్నిత సమస్యగా కొనసాగింది.  కానీ, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితికి చేరుకుంది. రాష్ట్రంలో పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది అని పేర్కొన్నారాయన. అలాగే.. మణిపూర్‌ పరిస్థితులను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని సీఎం బీరెన్‌ తెలిపారు. కాల్పుల ఘటనల దగ్గరనుంచి లోయ జిల్లాల్లో పౌర అశాంతి వరకు మారుతున్న హింసాకాండను అమిత్ షాకు వివరించాం. ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టేందుకు అవసరమైన సహకారం అందిస్తామని మాటిచ్చారు అని బీరెన్‌ ఇంఫాల్‌ వద్ద మీడియాకు వివరించారు. 

మణిపూర్‌ అల్లర్లపై అఖిలపక్ష భేటీ నిర్వహించిన అమిత్‌ షా.. ఆ మరసటిరోజే సీఎం బీరెన్‌ నుంచి నివేదికను అందుకోవడం గమనార్హం. అయితే నాలుగు గంటల పాటూ జరిగిన అఖిలపక్ష భేటీలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, బీరెన్‌ను సీఎంగా తప్పించాలని మెజార్టీ పార్టీలు కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ఇక.. కేంద్ర మంత్రి(సహాయ) ఇంటితో పాటు పలువురు మంత్రుల ఇళ్లపైనా జరిగిన దాడుల అంశాన్ని సైతం అమిత్‌ షా ప్రముఖంగా బీరెన్‌ వద్ద ప్రస్తావించి.. వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. 
 
మెయితీల గిరిజన హోదా డిమాండ్‌ను ఖండిస్తూ.. అక్కడి గిరిజన గ్రూపులు మే 3వ తేదీన జరిగిన గిరిజన సంఘీభావ యాత్రలో మొదలైన అల్లర్లు.. హింసాత్మకంగా మారి కొనసాగుతున్నాయక్కడ. 

ఇదీ చదవండి: వందే భారత్‌ బాత్‌రూంలో దాక్కుని..

మరిన్ని వార్తలు