మణిపూర్‌లో మళ్లీ వికసించిన కమలం.. ఎన్ని సీట్లు గెలిచాయంటే..

10 Mar, 2022 20:50 IST|Sakshi

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సత్తా చాటింది. ఒక్క పంజాబ్‌లో తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ కమలం వికసించింది. ఇక మణిపూర్‌లోనూ బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 31 స్థానాలను గెలుచుకొని మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు కైవసం చేసుకుంది.

ఇక కాంగ్రెస్ అయిదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్‌పీపీ ఏడు స్థానాల్లో.. ఎన్పీఎఫ్‌ కూడా అయిదు స్థానాల్లో విజయం సాధించింది. ఇక జేడీయూ ఆరు చోట్ల గెలుపొందింది. ఇతరులు అయిదు స్థానంలో గెలిచారు

మణిపూర్‌ సీఎం విజయం
మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ విజయం సాధించారు. హింగాంగ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పంగేజం శరత్‌చంద్ర సింగ్‌పై 17 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఆ సందర్భంగా బీరెన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. మణిపూర్ తదుపరి సీఎం ఎవరన్నది బీజేపీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందని  తెలిపారు.

సీఎం ఇంటి వద్ద సంబరాలు
మరోవైపు మణిపూర్‌లో బీజేపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇంఫాల్‌లోని బీజేపీ కార్యాలయం ముందు బాంబులు పేల్చారు.  సీఎం బీరెన్‌ సింగ్‌ ఇంటి వద్ద  మహిళలందరూ  ఉత్సాహంగా  సంబరాల్లో పాల్గొని.. సంప్రదాయ నృత్యాలలతో అలరించారు.

అప్పుడు- ఇప్పుడు
2017 మణిపూర్‌ ఎన్నికల్లో  60 స్థానాల్లో. 28 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్‌ మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది.  బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందింది. కానీ ప్రభుత్వం ఏర్పాటులో అక్కడే అంచనాలు తారుమరయ్యాయి. 21 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్‌)కు చెందిన నలుగురు, నేషనల్ పీపుల్స్ పార్టీకి(ఎన్‌పీపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్ జనశక్తి పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి మద్దతు లభించడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ 31కు చేరుకుంది. బీరెన్‌ సింగ్‌ నేతృత్వంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది.

పార్టీ 2017 2022
బీజేపీ 21 32
కాంగ్రెస్‌ 28 5
ఎన్‌పీపీ 4 7
ఎన్‌పీఎఫ్‌ 4 5
జేడీయూ 0 6
ఇతరులు 3 5
మరిన్ని వార్తలు