బీజేపీ నేతలపై మనీష్‌ సిసోడియా సెటైరికల్‌ పంచ్‌.. హాట్‌ టాపిక్‌గా కామెంట్స్‌

18 Mar, 2022 15:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్‌ కొంత ప్రభావం చూపించింది. ఇదిలా ఉండగా బీజేపీ నేతలను సెటైరికల్‌గా రావణుడితో పోల్చి వార్తల్లో నిలిచారు ఆప్‌ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియా.

వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి గుజరాత్‌లో 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాల సిలబస్‌లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడతామని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘాని గురువారం తెలిపారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఇది గొప్ప నిర్ణయం అంటూ మనీష్‌ సిసోడియా ప్రశంసించారు. 

ఇంతలోనే బీజేపీ నేతలపై సెటైరికల్‌గా ఓ పంచ్‌ విసిరారు. గుజరాత్‌ ప్రభుత‍్వం మంచి నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు భగవద్గీతను బోధించి విలువలు నేర్పించడం కీలక పరిణామం అన్నారు. ఈ క్రమంలోనే భగవద్గీతను పరిచయం చేసే వ్యక్తులు ముందుగా గీతలోని విలువలను ఆచరించాలని సూచించారు. కొందరు వ్యక్తులు గీత గురించి మాట్లాడాతారు.. కానీ వారు పనులు మాత్రం రావణుడిలా ఉంటాయని పరోక్షంగా బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీలో ఆప్‌ కార్యకర్తలు, మద్దతుదారులతో హోలీ సందర్భంగా సంబురాలు జరుపుకున్నారు. దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు