తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర

30 Oct, 2022 05:24 IST|Sakshi

సంబంధిత ఆడియో క్లిప్‌ను విడుదల చేసిన మనీష్‌ సిసోడియా

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో తరహాలో ఢిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణలో బయటకువచ్చిన మధ్యవర్తుల ఆడియో టేపుల ద్వారా ఈ కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రమేయం ఉందని తేలితే అరెస్ట్‌ చేసి విచారించాలని డిమాండ్‌చేశారు.

శనివారం సిసోడియా ఢిల్లీలోని ఆప్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ దళారిగా చెబుతున్న ఒక వ్యక్తి మాట్లాడిన ఆడియో టేప్‌ను మీడియాకు వినిపించారు. ‘టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైదరాబాద్‌లో అరెస్ట్‌ అయిన ముగ్గురిలో ఒకరు నేరుగా బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి’ అని సిసోడియా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రాజ్‌నా«థ్, కిషన్‌ రెడ్డి, ఇతర నేతలతో నిందితుల్లో కొందరు దిగిన ఫొటోలను మీడియాకు సిసోడియా చూపించారు.

రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ అనే మధ్యవర్తి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎలా కుట్ర పన్నారో ఆడియో టేప్‌లో స్పష్టంగా వెల్లడైందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తూ ఢిల్లీలోనూ ఎమ్మెల్యేలను కొనే వ్యవహారాన్ని నడిపిస్తున్నామని ఆడియో టేప్‌లో వినిపించిన అంశాన్ని సిసోడియా ప్రస్తావించారు. ‘ఇంకో ఆడియోలో ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేల కొనుగోలు తతంగం కొనసాగుతోందన్నారు.

అంటే అంతటి భారీమొత్తంలో బీజేపీ నగదు సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది’ అని అన్నారు. ‘ టేపుల్లో దళారులు అమిత్‌ షా పేరును పరోక్షంగా ప్రస్తావించడం తీవ్ర ఆందోళనకరం. షా ప్రమేయం ఉంటే ఆయన్ను వెంటనే అరెస్ట్‌ చేసి విచారించాలి. హోంశాఖ మంత్రి పదవి నుంచి తప్పించాలి.  ఈడీ విచారణ చేపట్టాలి’ అని అన్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనే అలవాటున్న బీజేపీకి ఉన్న రాజకీయపార్టీ గుర్తింపును ఈసీ రద్దుచేయాలని ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ డిమాండ్‌చేశారు.

మరిన్ని వార్తలు