వీడియో: కాంగ్రెస్‌-దేశం వేర్వేరుగా ఆలోచిస్తున్నాయ్‌.. ‘చప్రాసీలు’ సలహాలివ్వడం నవ్వుతెప్పిస్తోంది

27 Aug, 2022 10:47 IST|Sakshi

ఢిల్లీ: గులాం నబీ ఆజాద్‌ నిష్క్రమణ తర్వాత కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేతల ప్రకటనల పర్వం కొనసాగుతోంది. మరికొందరు సైతం పార్టీని వీడబోతున్నారనే సంకేతాలు అందుతున్నాయి. అయితే..  యాభై ఏళ్ల బంధం, మిగతా వాళ్లను కాదని ఏరికోరి పదవులు కట్టబెట్టినా కూడా ఆజాద్‌.. తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడడంపై చర్చ కూడా అదేస్థాయిలోనే కాంగ్రెస్‌లో జరుగుతోంది. అయితే.. 

కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణాలేంటో విశ్లేషించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ. దేశానికి, కాంగ్రెస్‌కు మధ్య సమన్వయ లోపం కారణంగానే పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని శనివారం ఉదయం ఢిల్లీలో మీడియా మాట్లాడుతూ ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘రెండేళ్ల కిందట మాలోని(కాంగ్రెస్‌ సీనియర్లను ఉద్దేశించి) 23 మంది పార్టీ పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ.. పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ఇక్కడి నుంచే దేశానికి, కాంగ్రెస్‌కు మధ్య గ్యాప్‌ మొలైంది. 

1885 జాతీయ కాంగ్రెస్‌ పుట్టినప్పటి నుంచి.. కాంగ్రెస్‌, దేశంతో పాటే నడిచింది. కానీ, పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కాబట్టి.. పార్టీకి ఇప్పటికైనా ఆత్మపరిశీలన అవసరం. డిసెంబరు 20, 2020న సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను భావిస్తున్నాను. అదే జరిగి ఉంటే.. ఆజాద్‌ ఈనాడు కాంగ్రెస్‌ను వీడేవారు కాదేమో! అని మనీశ్‌ తివారీ తన అభిప్రాయం తెలిపారు. 

డిసెంబరు 20, 2020న సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో.. సోనియా, రాహుల్‌ గాంధీలు కాంగ్రెస్‌లో సీనియర్లకు గౌరవం ఉంటుందని, వాళ్ల సలహాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఆ హామీ గాలికి పోయిందన్నది కాంగ్రెస్‌ జీ-23 నేతల ఆరోపణ.

ఆజాద్‌ లేఖ మీద చర్చోపచర్చలు అనవసరం. ఎందుకంటే ఆయన వివరణ ఎప్పుడూ సమర్థవంతంగానే ఉంటుంది. కానీ, కాంగ్రెస్‌ నుంచి కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వాళ్లు కూడా.. ఇవాళ పార్టీకి జ్ఞానం పంచాలని చూడడం నవ్వు తెప్పిస్తోందని మనీశ్‌ తివారీ అన్నారు.

శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన తన రాజీనామా లేఖలో.. దేశం కోసం పోరాడే సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని ఎత్తిపొడిచారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. చిన్న స్థాయి నేతల సూచనల మేరకు పార్టీ నడుస్తోందని ఆయన లేఖలో ఆరోపించారు. భారత్‌ జోడో యాత్రకు బదులు.. కాంగ్రెస్‌ జోడో యాత్ర చేపట్టాలంటూ సూచిస్తూనే.. పార్టీలో రాహుల్‌ పాత్రను తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఇదీ చదవండి: గులాం నబీ ఆజాద్‌.. విధేయుని అసమ్మతి

మరిన్ని వార్తలు