టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

12 Oct, 2022 03:48 IST|Sakshi

చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ సవాల్‌  

బాబు నుంచి ప్యాకేజీ అందగానే దత్తపుత్రుడి ట్వీట్లు

సాక్షి, అమరావతి: అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భావిస్తే.. ‘ఉత్తరాంధ్రకు అభివృద్ధి వద్దు .. విశాఖకు రాజధాని వద్దు..’ అని స్పష్టంగా చెప్పాలని లోక్‌ సభలో వైఎస్సార్‌ సీపీ చీఫ్‌ విప్, ఎంపీ మార్గాని భరత్‌ డిమాండ్‌ చేశారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, తన అనుచరుల భూములు కాపాడుకోవాలని ఉంటే చంద్రబాబు టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని సవాలు విసిరారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దమ్ము, ధైర్యంతో కాంగ్రెస్‌ పార్టీని విభేదించి బయటకు వచ్చి తనతోపాటు వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారని, వారంతా తిరిగి ఎన్నికల్లో పోటీచేసి గెలిచారని గుర్తుచేశారు. చంద్రబాబుకు కూడా దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్తే, ఎవరిసత్తా ఏమిటో తెలుస్తుందన్నారు.

అసెంబ్లీని రద్దుచేయమని చెబుతున్న అచ్చెన్నాయుడు.. ఐదేళ్లపాటు టీడీపీ చేసిన అవినీతి, ఆ ప్రభుత్వ విధానాలు నచ్చకే ప్రజలు 2019లో తమపార్టీకి పట్టం కట్టారని గుర్తుంచుకోవాలని సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..  ‘అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రైతుల ముసుగులో అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చంద్రబాబునాయుడు డైరెక్షన్‌లో జరుగుతోంది.

రాష్ట్రం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేసి, రాష్ట్ర సంపదనంతా అమరావతిలోని 29 గ్రామాల్లో కుమ్మరించాలనే కుట్రతో పాదయాత్ర జరుగుతోంది. అది తెలుగుదేశం పార్టీ ముసుగులో కొంతమంది చంద్రబాబు బినామీలు, బడాబాబులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. రైతుల పేరుతో చేస్తున్న యాత్ర. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలి. ఉత్తరాంధ్రలో మీరు అడుగుపెడితే, ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు.

అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ట్వీట్లు, మీడియా మీట్లు పెడుతున్న చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌ ఎక్కడ నివాసం ఉంటున్నారు. అమరావతి మాత్రమే క్యాపిటల్‌ కావాలని కోరుకుంటున్న ఈ ముగ్గురు ఎందుకు ఆ ప్రాంతంలో నివాసం ఉండకుండా హైదరాబాద్‌లో ఉంటున్నారు?  చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ పూర్తిగా అజ్ఞానవాది.

2018లో గుంటూరు సభలో ఈ దత్తపుత్రుడు.. రాజధాని పేరుతో కేవలం అమరావతి చుట్టుపక్కలే అభివృద్ధి కావాలా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏమవ్వాలి అని అన్నారు. ఇప్పుడు అమరావతే రాజధాని కావాలని ట్వీట్లు పెడుతున్నారు. బాబు నుంచి ప్యాకేజీ అందగానే దత్తపుత్రుడి ట్వీట్లు బయటకు వస్తాయి.  

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ లక్ష్యం. అమరావతి రాజధాని కాదని మేము ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలు కూడా రాజధానులుగా ఉంటే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది సీఎం ఆలోచన.  మూడేళ్లుగా సీఎం జగన్‌ ఒక్క రూపాయి అవినీతి లేకుండా, కులమత ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు