Punjab: సీఎం భగవంత్‌ మాన్‌కు కవి వార్నింగ్‌..

20 Apr, 2022 11:59 IST|Sakshi

చండీగఢ్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ నేత, కవి కుమార్‌ విశ్వాస్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. పంజాబ్‌ పోలీసులు తన ఇంటి ముందు నిల్చున్న ఫోటోలను ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను హెచ్చరించారు. ‘ఈ రోజు ఉదయం పంజాబ్‌ పోలీసులు మా ఇంటి వద్దకు వచ్చారు. ‘పంజాబ్‌ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఢిల్లీలో కూర్చున్న వ్యక్తిని హెచ్చరిస్తున్నాను. అతను ఏదో ఒక రోజు నిన్ను(భగవంత్‌ మాన్‌) పంజాబ్‌ ప్రజలను కూడా ద్రోహం చేస్తాడు. నా హెచ్చరికను దేశం గుర్తించుకుంటుంది’ అని ట్వీట్‌ చేశాడు.

అయితే ఈ ట్వీట్‌లో విశ్వాస్‌ కేజ్రీవాల్‌ పేరును ట్వీట్‌లో ప్రస్తావించలేదు. కాగా కుమార్‌ విశ్వాస్‌ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. విశ్వాస్ ట్వీట్ చేసిన వెంటనే ఆప్ నాయకుడు నరేష్ బల్యాన్ స్పందించాడు.. విశ్వాస్‌ ఎందుకు అంతలా భయపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు తమరు చెప్పిన దానికి పోలీసులు రుజువు అడుగుతున్నారని, సాక్ష్యాధారాలు ఇచ్చి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలంటూ హితవు పలికారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దేశాన్ని విచ్చిన్నం చేసేలా అరవింద్‌ జ్రీవాల్‌ మాట్లాడారని ఆరోపించారు. కేజ్రీవాల్‌, ఆప్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలకు సంబంధించి విశ్వాస్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే  అతని ఇంటికి పోలీసులు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు