‘కేసీఆర్‌కు వర్షాలు ఎలా పడతాయో తెలీదా?’ 

19 Jul, 2022 03:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన జీవితంలో ఇప్పటివరకు 80 వేల పుస్తకాలు చదవిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వర్షాలు ఎలా పడతాయో కూడా తెలియకపోవడం బాధాకరమని మాజీ మంత్రి, జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ వైస్‌చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ భారీ వర్షాలు పడటం అంతర్జాతీయ కుట్ర అనడం కేసీఆర్‌ అవివేక మని పేర్కొన్నారు.

గతంలో క్లౌడ్‌ బరస్ట్‌ లడఖ్, ఉత్తరాఖండ్‌లో జరిగిందని తర్వాత గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జరిగిందనడంలో ఎలాంటి ఆధారాల్లేవన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ఏ పంప్‌హౌజ్‌ కూడా ఇప్పటివరకు మునిగిపోయిన దాఖలాల్లేవని శశిధర్‌రెడ్డి తెలిపారు. క్లౌడ్‌ బరస్ట్‌ జరిగితే గంటకు వంద మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదు కావాలి కానీ, గోదావరిపై అంతటి వర్షపాతం లేదన్నారు. కేసీఆర్‌ పక్కనే ఉన్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఏం సలహాలు, సూచనలు ఇస్తున్నారో తెలియ డం లేదని విమర్శించారు. కేవలం కాళేశ్వరం పంప్‌హౌజ్‌ మునిగిపోయిన వ్యవహారాన్ని డైవర్ట్‌ చేసేందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు