యూపీలో కీలకంగా మారిన ఓటింగ్‌ శాతం.. ఎఫెక్ట్‌ ఎవరిపై యోగి..? అఖిలేష్‌..?

5 Mar, 2022 13:29 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లో ఆరు దశల ఓటింగ్‌ తర్వాత పార్టీల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటిదాకా అన్ని దశల పోలింగ్‌లో తగ్గిన ఓటింగ్‌ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్నదే ఆ చర్చ. దీనిపై బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు వాటికి అనుకూలమైన వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ‘నిశ్శబ్ద నో షో’, అంటే ఓటేయని వారి వల్ల ఎవరికి నష్టమన్నదే రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుల మధ్య ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ‘తగ్గిన ఓటింగ్‌ శాతం ఫలితాన్ని మారుస్తుందా అంటే, కచ్చితంగా తారుమారు చేస్తుంది. కానీ అది ఎవరికి లాభం, ఎవరికి నష్టమో తేలాలంటే 10వ తేదీ దాకా ఎదురు చూడాల్సిందే’ అని బెనారస్‌ హిందూ యూనివర్సిటీ మాలవీయ రీసెర్చి సెంటర్‌ కు చెందిన ప్రొఫెసర్‌ కవితా షా అన్నారు. తగ్గిన పోలింగ్‌ శాతాలపై ఆమె అధ్యయనం చేస్తున్నారు.

ఓటు వేయకపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తొలి, రెండో విడత పోలింగ్‌లో 2017 కంటే ఈ సారి పోలింగ్‌ శాతం తగ్గింది. 2017లో తొలి దశలో 64.6 శాతం, రెండో దశలో 65.5 శాతం నమోదైతే ఈసారి 62.5, 64.7 శాతానికి తగ్గింది. మూడు, నాలుగో దశల్లో కూడా గతంతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరగలేదు. ‘ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయినప్పుడు పోలింగ్‌ శాతం పెరుగుతుందంటారు. కానీ యూపీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని భావిస్తున్నాను’ అని సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌ స్టడీస్‌ (జేఎన్‌యూ) హెచ్‌ఓడీ ఆర్‌.నరేంద్రకుమార్‌ విశ్లేషించారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం తగ్గిన జిల్లాల్లో ఆయన తన రీసెర్చి విద్యార్థులతో పర్యటిస్తున్నారు. రాజధాని లక్నోకు పొరుగున ఉన్న సీతాపూర్‌ పట్టణంలో 2017లో 61.8 శాతం పోలింగ్‌ జరిగితే ఈసారి 52.6కు పడిపోయింది. అంటే దాదాపు 35 వేల ఓట్లు పోలవలేదు.

2017లో ఇక్కడ బీజేపీ 24 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచింది. సీతాపూర్‌ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో సగటున 62.7% ఓటింగ్‌ నమోదైంది. ఇది కూడా గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 6 శాతం తక్కువ. ఆ ఎన్నికల్లో బీజేపీ వీటిలో ఏడింటిని గెలుచుకుంది. అయితే, ‘గతంలో ఆగ్రా సౌత్, శ్రీనగర్, ఉన్నావ్‌ వంటిచోట్ల బీజేపీ పెద్ద పెద్ద మెజారిటీలతో గెలిచింది. కాబట్టి అలాంటి చోట్ల ఓటింగ్‌ శాతం తగ్గినా బీజేపీ అభ్యర్థులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’ అని ఇండియన్‌ జర్నల్‌ అఫ్‌ పొలిటికల్‌ సైన్స్‌ (వారణాసి) డైరెక్టర్‌ వి.కె.బాజ్‌పేయి విశ్లేషించారు. 

139 సీట్లలో తగ్గింది! 
తొలి నాలుగు దశల్లోని 231 స్థానాల్లో చూసుకుంటే ఏకంగా 139 చోట్ల ఓటింగ్‌ శాతం బాగా తగ్గింది. సీతాపూర్, సేవాత నియోజకవర్గాల్లో 2017తో పోలిస్తే 9 శాతం తగ్గుదల ఉంది. ఆరు స్థానాల్లో ఎటువంటి మార్పు కనిపించకపోగా 86 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ శాతం కాస్త పెరిగింది. తక్కువ నమోదైన 139 సీట్లలో 28 చోట్ల దాదాపు 10 వేల చొప్పున ఓట్లు తగ్గాయి. వీటిలో 24 సీట్లను 2017లో బీజేపీ గెలుచుకుంది. అయితే వాటిలో చాలావరకు తక్కువ ఓట్ల తేడాతో గెలిచినవే. ఉదాహరణకు సీతాపూర్‌ జిల్లాలోని మహోలీలో కేవలం 3,700 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది. ఇక్కడ 2017లో 68.7 శాతం ఓటింగ్‌ జరిగితే ఈసారి 63.5కు తగ్గింది. ఇది ఎవరిపై, ఎలా ప్రభావం చూపుతుందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ బరిలో ఉన్న కర్హాల్‌ నియోజకవర్గంలోనేమో పోలింగ్‌ ఈసారి 7 శాతం పెరిగింది.  

తగ్గిన ఓటింగ్‌ శాతం ఫలితాలపై ప్రభావం చూపుతుందా?  
2017లో 403 సీట్లకు గాను బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 312 నెగ్గి అఖండ విజయం సాధించినప్పుడు కూడా ఓవరాల్‌ ఓటింగ్‌ శాతం తక్కువే నమోదైంది. కాబట్టి ఈసారి మరో ఒకట్రెండు శాతం తగ్గినా అది మొత్తం ఫలితాలపై ప్రభావం చూపుతుందా అంటున్న వారూ లేకపోలేదు. ‘ఇక్కడ బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ తీవ్రంగా లేదు. ఓటింగ్‌ శాతం తగ్గడానికి అదీ ఓ కారణం కావచ్చు. అంతమాత్రాన తక్కువ ఓటింగ్‌ శాతం వల్ల ఫలితాలే తారుమారు అవుతాయనుకోవడం పొరపాటు. మా ప్రభుత్వమే కొనసాగాలనుకునే వారు ఓటింగ్‌పై బహుశా ఆసక్తి చూపలేదేమో’ అని వారణాసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. 

ఓటేయకపోవడానికి కారణాలెన్నో ‘ఓటరు ఓటేయలేదంటే, లిస్ట్‌లో పేరు కనిపించకపోవడం, పోలింగ్‌ బూత్‌ దూరంగా ఉండటం వంటి అనేక కారణాలుండొచ్చు’ అని వారణాసి అదనపు జిల్లా మేజిస్టేట్, రిటర్నింగ్‌ అధికారి కౌశల్‌ రాజ్‌ శర్మ సాక్షి ప్రతినిధులతో చెప్పారు. ఓటేయాలని తాము విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు.   
-వారణాసి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి.

మరిన్ని వార్తలు