ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

12 May, 2022 15:45 IST|Sakshi

ఆజం ఖాన్‌కు అండగా నిలిచిన మాయావతి

బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తోందని ఫైర్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేటుకుంది. అవినీతి సహా పలు ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌కు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మద్దతుగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు ఆయనపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నాయని గురువారం విమర్శించారు. ఈ మేరకు వరుసగా ట్విటర్‌ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. 

‘యూపీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై నిరంతర ద్వేషపూరిత, ఉగ్రదాడులకు పాల్పడుతూ సీనియర్ ఎమ్మెల్యే మహ్మద్ ఆజం ఖాన్‌ను రెండున్నరేళ్లపాటు జైల్లో ఉంచింది. ప్రజల దృష్టిలో ఇది న్యాయం గొంతు నొక్కడం కాకపోతే ఇంకేంటి?’ అని మాయావతి ప్రశ్నించారు. 

88 కేసుల్లో బెయిల్
ఆజం ఖాన్ రెండేళ్లుగా సీతాపూర్ జైలులో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 కేసులు పెట్టగా 88 కేసుల్లో బెయిల్ లభించింది. శత్రువుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో బుధవారం అలహాబాద్ హైకోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చివరి కేసులో కూడా బెయిల్‌ మంజూరయ్యాకే జైలు నుంచి ఆజం ఖాన్ విడుదల కానున్నారు. (క్లిక్: అనూహ్యం.. డీజీపీని తప్పించిన సీఎం యోగి)

కూల్చివేతలు కరెక్ట్ కాదు
కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అధికారులు చేపట్టిన నిర్మాణాల కూల్చివేతలను మాయావతి తప్పుబట్టారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో దురుద్దేశపూరితంగా ఆక్రమణల తొలగింపు పేరుతో వలస కార్మికులు, శ్రామిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ వారి జీవనోపాధిని లాగేసుకుంటున్న తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తడంతోపాటు ఆందోళన కలిగిస్తోంద’ని ఆవేదన వ్యక్తం చేశారు. (క్లిక్:  ‘అవార్డ్‌ వాపసీ’పై బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం)

మరిన్ని వార్తలు