Pegasus: రాజ్యసభలో గందరగోళం, టీఎంసీ ఎంపీ సస్పెన్షన్‌

23 Jul, 2021 12:12 IST|Sakshi

మూడో  రోజూ పార్లమెంటులో పెగాసస్‌ పొగలు

టీఎంపీ ఎంపీ సస్పెన్షన్‌

ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలూ వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పెగాస‌స్  ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడవ రోజు కూడా సెగలు పుట్టించింది. పెగాస‌స్ స్పైవేర్ కుంభకోణం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాల‌ని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పెద్దల సభ రాజ్యసభలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్‌పై  వేటు వేయడం ఆందోళనకు దారి తీసింది.  ఈ వర్షాకాల  సమావేశాల కాలానికి రాజ్యసభ నుంచి శంతనును  సస్పెండ్ చేశారు.

పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి వీ మురళీధరన్ సస్పెన్షన్ కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ, సేన్‌ను సస్పెండ్ చేశారు. సభలో పత్రాలను చించివేసిన అంశంపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ ప్రకటన సందర్భంగా దుమారం రేగింది.  అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయివా దేశారు. అటు ఇదే అంశంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ  సోమవారానికి వాయిదా పడింది.

మరోవైపు ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాన్ని దేశన్యాయవ్యవస్థ, ప్రతిపక్షనేతలపై ఎక్కు పెట్టడం, జర్నలిస్టులపై నిఘా పెట్టడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. తన ఫోన్లన్నింటిని కూడా ట్యాప్‌ చేసిన ఉంటారనిఆరోపించారు. దీనిపై జ్యుడిషియ‌ల్ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.  కాగా పెగాసస్‌ వ్యవహారంపై గురువారం రాజ్యసభలో ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సమాధానం ఇస్తుండగా, ఆ  పత్రాలను లాక్కొని చించి వేశారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సభను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు