‘అక్కడ వంగి వంగి దండాలు పెట్టుడు.. ఇక్కడికి రాంగనే తిట్ల పురాణం’

14 Sep, 2021 15:54 IST|Sakshi

సాక్షి, మెదక్‌: బీజేపీ పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నాడని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. ఇంటిలిజెన్స్ సర్వేలో వచ్చే ఎన్నికల్లో  బీజేపీ  అధికారంలోకి  రావడం ఖాయమని  తెలుసుకున్న సీఎం కేసీఆర్..  బీజేపీని తొక్కేయాలని పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. మెదక్‌ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధానమంత్రికి వంగి వంగి దండాలు పెట్టిన కేసీఆర్‌..  రాష్టానికి రాగానే మోదీని, తనను తిట్టడం తప్ప వేరే పని చేయడం లేదని  తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వరి వేస్తే ఉరి వేసినట్లేనని సీఎం చెప్పాక 5 గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బండి సంజయ్‌ తెలిపారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. సీఎం మాటలు తట్టుకోలేక తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సీఎం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వర్షాలతో తెలంగాణలో పంటలు ఎక్కువ పండుతున్నాయని, ఆ పంటలను కొనడం చేతగాని సీఎం ఆ నెపాన్ని కేంద్రంపై మోపాలని చూస్తున్నాడని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రైతులకు కేసీఆర్‌ ఎందుకు అందించడం లేదని,  ఫసల్ బీమా ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

జీతాలివ్వడానికే డబ్బుల్లేని ప్రభుత్వం దళిత బంధు ఇస్తానని ఆశ చూపుతూ మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం తన కేబినెట్‌లో 27 మంది బీసీలను, 12 మంది ఎస్సీలను, 8 ఎస్టీలను, 12 మంది మహిళలను, 6గురు మైనారిటీలను మంత్రులుగా చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ. హైదరాబాద్, వరంగల్‌లో వరదలొస్తే ఈ సీఎం రాలేదు. ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం రాలేదు. ఆర్టీసీ కార్మికులు చచ్చినా వెళ్లడు. పేద్దోళ్లు చనిపోతే మాత్రం వెళ్లి బోకేలు పెట్టి సంతాపం చెబుతాడు. కానీ బాధితులను, పేదల వద్దకు వెళ్లి భరోసానిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. ఈ మూర్ఖుడి పాలనలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్‌ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. కొన ఊపిరితో కొట్లాడుతూ సిరిసిల్ల ఇంటర్ విద్యార్థిని నాకు బతకాలని ఉంది. కాపాడండీ...అంటూ ఏడుస్తుంటే చూడలేని సన్నివేశం. చివరకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన దుస్థితి. 

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలా? వద్దా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బరాబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి మాట తప్పిన నీచుడు కేసీఆర్. ఆదిలాబాద్ జిల్లాలో ఒకే మర్రి చెట్టుకు వెయ్యి మందిని ఉరేసిన చరిత్ర నిజాం పాలనది. ఆ రోజు స్మరించుకోవాలా? వద్దా? కేసీఆర్. ఎంఐఎం నేతలకు భయపడి నిజాం సమాధి వద్ద మోకరిల్లిన మూర్ఖుడు కేసీఆర్. వాళ్లకు భయపడి, నిజాం ఆస్తుల కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. అందుకే కేసీఆర్ మోసాలను ఎండగట్టేందుకు, తెలంగాణ విమోచన దినోత్సవ గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పేందుకే నిర్మల్ లో ఈనెల 17న జరిగే సభకు అమిత్ షా వస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు