ప్చ్‌.. ఆయనొక బీజేపీ నేత.. పేరు మాత్రం ‘కాంగ్రెస్‌’!

25 Mar, 2022 19:29 IST|Sakshi

కన్ఫ్యూజ్‌ కాకండి. కాంగ్రెస్‌ అనేది ఉత్తర ప్రదేశ్‌లో ఓ బీజేపీ ప్రముఖ నేత పేరు. పూర్తి పేరు కాంగ్రెస్‌ సింగ్‌. పుట్టగానే ఆయన తల్లిదండ్రులు ఆ పేరు పెట్టేశారు. కానీ, ఏం చేస్తారు.. బీజేపీలో చేరాకే ఆయన తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. 

స్వతంత్ర దేవ్‌ సింగ్‌.. అసలు పేరు కాంగ్రెస్‌ సింగ్‌. ఉత్తర ప్రదేశ్‌లో బలమైన ఓబీసీ నేత(కుర్మి సామాజికవర్గం). ప్రస్తుతం బీజేపీ ఉత్తర ప్రదేశ్‌ యూనిట్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇంతకు ముందు ఆయన యోగి ఆదిత్యానాథ్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు.

ఫిబ్రవరి 13, 1964లో మీర్జాపూర్‌ జిల్లా జమల్‌పూర్‌ తాలుకా ఓరీ గ్రామంలో పుట్టాడు ఈయన. ఎలాంటి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని కుటుంబం ఆయనది.  కానీ, కాంగ్రెస్‌ పార్టీ మీద అభిమానంతో ఆయన తల్లిదండ్రులు.. ఆయనకు కాంగ్రెస్‌ అని పేరు పెట్టారు. బీఎస్సీ చదవిన కాంగ్రెస్‌.. యూనివర్సిటీ దశ నుంచే ఏబీవీపీలో యాక్టివ్‌గా ఉండేవాడు. 

ఆ తర్వాత ఆయన ఓ హిందీ పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తూ.. బీజేపీ అనుబంధ సంస్థల కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొనేవాడు. 1988లో ఆయన బీజేపీలో చేరాక.. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పేరు మార్చుకున్నాడాయన. ఆ పేరే స్వతంత్ర దేవ్‌ సింగ్‌. అయితే ఊళ్లో వాళ్లు, బంధువులు.. వెటకారంగా స్నేహితులు-ప్రత్యర్థులు కూడా ఇప్పటికీ ఆయన్ని కాంగ్రెస్‌ సింగ్‌ అనే పిలుస్తుంటారట. 

బీజేపీలో కీలక బాధ్యతలెన్నో చేపట్టిన ఆయన.. యూపీ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన మిస్టర్‌ సింగ్‌.. 2014, 2017 ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలు గ్రాండ్‌ సక్సెస్‌ కావడంలో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు