గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ

4 Dec, 2021 21:20 IST|Sakshi

న్యూఢిల్లీ: పీడీపీ చీఫ్‌, జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలకులు గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారని మండిపడ్డారు. గాడ్సే కశ్మీర్‌ను కూడా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమె శనివారం అజెండా ఆజ్‌తక్‌ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తండ్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్ సీఎంగా ఉన్న సమయంలో కశ్మీరీ పండిట్‌లకు సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు.

రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఆర్టికల్‌ 370ని రద్దుచేసి, కొత్త కశ్మీర్‌ను నిర్మించామని బీజేపీ పాలకులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి కూతురు తన తండ్రి మృతదేహం ఎక్కడని అడుగుతోంది. ఓ చెల్లి తన అన్న మృతదేహం కోసం ఎందురు చూస్తోందని అన్నారు. ఈ పరిస్థతులను ప్రశ్నించినవారిపైనే నిందలువేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

ఇన్ని జరుగుతున్నా.. పాలకులు మాత్రం ప్రతీసారీ కొత్త కశ్మీర్‌ అంటూ మాట్లాడుతారని.. కొత్త హిందూస్తాన్‌ గురించి ఎందుకు మాట్లాడరని సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 అంటే బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేయలేరని తెలిపారు. ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తారని, ఇటువంటి నిబంధనలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఆర్టిక‌ల్ 370 తాత్కాలిక నిబంధ‌న కాద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానం స్ప‌ష్టం చేసింద‌ని మెహ‌బూబా ముఫ్తీ గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు