చెరగని గౌతమ ముద్ర

2 Jun, 2022 12:55 IST|Sakshi
గౌతమ్‌రెడ్డి(ఫైల్‌ఫోటో)

రికార్డు మెజార్టీలు మేకపాటి గౌతమ్‌రెడ్డికే సొంతం

అతి స్వల్ప మెజార్టీ రికార్డు ఆనం సంజీవరెడ్డిదే

1958, 2022లో ఉప ఎన్నికలు

9 సార్లు కాంగ్రెస్, 3 సార్లు     స్వతంత్ర అభ్యర్థుల విజయం

రెండేసి సార్లు వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపు

ఎన్నికల క్షేత్రంలో ఆత్మకూరు గడ్డపై మహామహులు తలపడ్డారు. ఏడు దశాబ్దాల చరిత్రలో నేటితరం దివంగత నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఇందులో అత్యధిక మెజార్టీల రికార్డు ఆయనకే సొంతమైంది. అతి స్వల్ప మెజార్టీతో విజయ తీరానికి చేరిన చరిత్రను ఆనం సంజీవరెడ్డి దక్కించుకున్నారు. వరుసగా రెండేసి సార్లు గెలుపొందిన ముగ్గురిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. ప్రజల మనస్సు దోచిన ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఉప ఎన్నికల్లోనూ గౌతమ్‌ ముద్ర సృష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయ యవనికపై ఎందరో నేతలు వస్తుంటారు.. కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వారు ఒకరో ఇద్దరు ఉంటారు. అందులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని మూటకట్టుకున్న నేటి తరం నాయకుడు గౌతమ్‌ చెరగని ముద్ర వేశారు.

వరుసగా రెండు దఫాలు అత్యధిక మెజార్టీలు దక్కించుకున్న నేతగా మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ నియోజకవర్గ చరిత్రలో మిగిలిపోయారు. 1952 నుంచి 2019 వరకు 16 దఫాలు ఎన్నికలు జరిగాయి. తాజాగా ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం ఇది రెండు దఫా అవుతుంది. 1958లో తొలిసారి ఆత్మకూరు ఉప ఎన్నికలు రాగా, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దివంగతులు కావడంతో రెండో దఫా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం నామినేషన్లు పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.   

అత్యధికం గౌతమ్‌రెడ్డి.. అతి స్వల్పం సంజీవరెడ్డి
ఆత్మకూరు ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ మేకపాటి గౌతమ్‌రెడ్డి సొంతం కాగా, అతి స్వల్ప మెజార్టీ ఆనం సంజీవరెడ్డి  దక్కాయి. 1958లో బెజవాడ గోపాల్‌రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. అప్పట్లో ఆయన సర్వేపల్లిలో కొనసాగుతూ ఆత్మకూరు శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అప్పట్లో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఆనం సంజీవరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి జీసీ కొండయ్యపై 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనం సంజీవరెడ్డికి 22,358 ఓట్లు లభించగా, పీఎస్‌పీ అభ్యర్థి జీసీ కొండయ్యకు 22,313 ఓట్లు లభించాయి. ఆత్మకూరు చరిత్రలో ఇది అతి స్వల్ప మెజార్టీగా చరిత్రగా నిలిచిపోయింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి 31,412 ఓట్లు మెజార్టీ లభించింది. రెండో దఫా 2019 ఎన్నికల్లోనూ 22,276 ఓట్ల అత్యధిక మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలు ఇవే కావడంతో ఆ రికార్డులు గౌతమ్‌రెడ్డికి దక్కాయి. స్వల్ప మెజార్టీతో విజయం దక్కించుకున్న వారిలో మరో ఇరువురు ఉన్నారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి బి సుందరరామిరెడ్డి బీజేపీ అభ్యర్థి కె ఆంజనేయరెడ్డిపై 334 ఓట్లుతో విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య, టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్షుమయ్యనాయుడిపై 2,069 ఓట్లతో విజయం సాధించారు. ఇవే తక్కువ మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందిన ఎన్నికలు కావడం విశేషం.
   
టీడీపీయేతరులే విజేతలు  
ఆత్మకూరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీకి అడ్డాగా నిలిచిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు 7 సార్లు ఎన్నికలు జరిగితే.. 5 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 1983, 94లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, రెండు సార్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. 

వరుసగా రెండు సార్లు గెలిచిన జాబితాలో ముగ్గురు
ఆత్మకూరులో 16 దఫాలుగా ఎన్నికలు జరిగితే.. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన వారు ముగ్గురే. ఇందులో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. 1958, 1962లో వరుసగా రెండు సార్లు ఆనం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1978లో తొలిసారి విజయం సాధించిన బి సుందరరామిరెడ్డి 1983లో టీడీపీ అభ్యర్థి అనం వెంకటరెడ్డితో తలపడి ఓడిపోయారు. తిరిగి 1985, 89లో వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా అక్కడి నుంచి సుందరరామిరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 19ల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి వరసగా రెండు సార్లు ఘన విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు